హీరోగా ఇంట గెలవలేకపోయినా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గెలిచాడు ఆది పినిశెట్టి. సరైనోడు సినిమాలో విలన్ గా బాగానే మార్కులు సంపాదించాడు. ఇప్పుడు రంగస్థలంలో హీరో అన్నగా బాగా చేసాడు అనిపించుకున్నాడు.
కూల్ గా, సెటిల్డ్ గా, చేసిన పెర్ ఫార్మెన్స్ బాగానే పండింది. నిజానికి ఆది మంచి నటుడు కాదని ఎప్పుడూ ఎవ్వరూ అనలేదు. తమిళంలో చేసినా, తెలుగులో చేసినా, అతని నటనకు వంక లేదు. కానీ సినిమాలు సరైన హిట్ కాలేదు. పైగా అతనికి సరైన సినిమా పడలేదు.
దీంతో హీరోగా సెటిల్ కావడం అన్నది కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి టైమ్ లో ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టితో వున్న అనుబంధంతో కావచ్చు గీతా అరవింద్ సూచనతో బోయపాటి ఇచ్చిన విలన్ క్యారెక్టర్ తో కెరీర్ టర్న్ అయింది.
నిన్ను కోరి సినిమాలో చేసిన క్యారెక్టర్ కూడా మాంచి డీసెంట్ గా, క్లాస్ గా కనిపించింది. అజ్ఞాతవాసిలో కూడా యంగ్ విలన్ గా చేసాడు కానీ, హీరో క్యారెక్టర్ ముందు దానికి అంత స్కోప్ లేకుండా పోయింది.
ఇప్పుడు మళ్లీ మరోసారి మెగా ఫ్యామిలీనే మరో మంచి క్యారెక్టర్ ఆఫర్ చేసింది. దీంతో ఆది కెరీర్ తెలుగులో ఇక ఫిక్సయిపోయినట్లే. యంగ్ హీరోలకు యంగ్ విలన్ గా, యంగ్ హీరోల మల్టీస్టారర్ ల్లో సపోర్టింగ్ గా ఆది కోసం ఇప్పుడు దర్శకులు ఆఫర్లతో రావడం పక్కా. ఇలా జనాల్లోకి బాగా పాపులర్ అయితే. అప్పుడు మళ్లీ హీరోగా ట్రయ్ చేయచ్చు. ఆ విధంగా తెలుగులో సెటిల్ అవ్వాలన్న ఆది కోరిక పూర్తిగా నెరవేరుతుందేమో?