కార్తికేయ సినిమాను కన్నడంలో రీమేక్ చేసి, తండ్రి మాదిరిగానే శాండల్ వుడ్ కు పరిచయం కావాలని అనుకున్నాడు ఆది సాయికుమార్. ఆ మేరకు కాస్త హడావుడి జరిగింది. తెలుగులో దుకాణం దాదాపు ఓ జంక్షన్ లోకి వచ్చి ఆగింది. ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి. అందుకే అటు కార్తికేయ రీమేక్ మీద కూడా నిర్ణయం తీసుకోలేకపోయాడు. దీంతో మరో కొత్త హీరో ఆ ప్రాజెక్టును తన్నుకుపోతున్నట్లు తెలుస్తోంది.
ఇంకా విడుదల కాని రవిబాబు అదిగో సినిమాలో హీరోగా నటించిన అభిషేక్ వర్మ కార్తికేయ ద్వారా కన్నడ రంగానికి పరిచయం కావాలనుకుంటున్నాడట. ఈ కుర్రాడి ఫ్యామిలీ చాలా కాలంగా బెంగుళూరులో సెటిల్ అయింది. ఆ కుర్రాడి తండ్రే సినిమాను నిర్మించేపనిలో వున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మాంచి క్యాచీ టైటిల్ కూడా రిజస్టర్ చేసారని వినికిడి.
కార్తికేయ కన్నా ఆ టైటిల్ అంటే కన్నడనాట క్రేజ్ వుంటుందని ఆలోచన. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే..కుమారస్వామి. దానికి కన్నడ నాట ఎందుకు క్రేజ్ నో వేరే చెప్పక్కరలేదుగా.