రైతుల పొలాల్లో కుప్పలు కుప్పలుగా ఉల్లిపాయలు.. మార్కెట్ చేయడానికి వీలుగా లేని పరిస్థితులు.. మార్కెట్లోకి తీసుకొద్దామంటే, కొనేందుకు సిద్ధంగా లేమంటున్న వ్యాపారులు.. మార్కెట్లోకి ఉల్లిపాయలు రాక, పెరిగిపోతున్న ఉల్లిధరలు. రైతులేమో 50 పైసలకు కూడా అమ్మలేని పరిస్థితి. వ్యాపారులేమో కిలో 25 రూపాయలకు పైగా అమ్ముకుంటోన్న దుస్థితి.
– ఇవీ ఉల్లి రైతుల కష్టాలు, ఉల్లి వ్యాపారుల సంబరాలు, ఉల్లి కొనుగోలుదారుల పాట్లు.
బ్యాంకులకు వెళితే చాంతాడంత క్యూ లైన్లు.. ఏటీఎంలలో దొరకని 100 రూపాయల నోట్లు.. పెళ్ళిళ్ళు ఆగిపోయాయ్.. ఆఖరికి చావు ఇంట్లో కూడా దయనీయ స్థితే. వైద్యం దొరక్క ప్రాణాలు పోతున్నాయ్. చెప్పుకుంటూ పోతే సామాన్యుడి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజులు గడుస్తున్నా దేశంలో కరెన్సీ సంక్షోభం ఏమాత్రం తీరడంలేదు. ఇంకెప్పుడు తీరతాయో అర్థం కావడంలేదు. అయినా, ప్రధాని నరేంద్రమోడీ 'అచ్చే దిన్ ఆయేగీ' అంటున్నారు. సామాన్యులు హాయిగా నిద్రపోతున్నారట.. నల్లకుబేరులు నిద్రమాత్రల కోసం పరుగులు పెడుతున్నారట. ఎక్కడ.? నరేంద్రమోడీ బ్యాంకుల వద్దకు వస్తే తెలుస్తుందిగానీ, ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది.?
ఉల్లి వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు.. ఇలా ఒకరేమిటి.? ఆన్లైన్, కార్డ్ స్వైపింగ్ వ్యాపారం తప్ప, నోట్ల చెలామణీతో అయ్యే కొనుగోళ్ళు, అమ్మకాలు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా టోల్గేట్ల వసూళ్ళు నిలిచిపోయాయి. ఆఖరికి ఎయిర్పోర్ట్ పార్కింగ్ రుసుము కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నష్టం లక్షల్లో కాదు, కోట్లలో.. అదీ వందలు, వేల కోట్ల రూపాయల్లో నష్టం వుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
నల్లధనమంతా తెల్లగా మారిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ మాయమాటలు చెప్పొచ్చుగాక. అదెప్పటికి జరిగేనో, అసలు జరిగేనో లేదో.. ఈలోగా తెల్లధనం దొరక్క.. జనాలు మాడిమసైపోతున్నారు. ఓ పక్క రూపాయి చితికిపోతోంది.. ఇంకోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.. చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభంలోకి దేశం నెట్టివేయబడ్తోంది. ముందస్తుగా ఈ పరిస్థితుల్ని అంచనా వేసే మెకానిజం లేకపోవడమో.. మూర్ఖత్వమో.. కారణం ఏదైతేనేం, దేశాన్ని నరేంద్రమోడీ భ్రష్టుపట్టించేశారన్న మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచీ విన్పిస్తోంది.
రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేయడాన్ని తప్పుపట్టలేం. అంతకు మించిన ఉపాయం నల్లధనాన్ని అరికట్టేందుకు ఇంకోటి కనిపించదు. కానీ, ఒక రోజు కాకపోతే రెండో రోజు… లేదంటే మూడో రోజు.. అదీ కుదరదంటే నాలుగైదు రోజుల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థనీ, లావాదేవీల్నీ క్రమబద్ధీకరించాలి కదా.! రోజులు పెరుగుతున్నకొద్దీ వ్యాపారాలు కుదేలై, పన్నులు తగ్గిపోయి, ఖజానా నిర్వీర్యమైపోయి.. ఈ నష్టాన్ని మళ్ళీ భరించేదెవరు.? నరేంద్రమోడీ భరించడు కదా.. భరించాల్సి సామాన్యుడే.