అమీర్‌ఖాన్‌.. నీకేమయ్యింది.?

అమీర్‌ఖాన్‌ అంటే బాలీవుడ్‌లో ఒకప్పుడు చాలామందికి గౌరవం. పెద్ద స్టార్‌ అయినా, విలక్షణ సినిమాలవైపు మాత్రమే మొగ్గు చూపేవాడు. కమర్షియల్‌ సక్సెస్‌ల గురించే ఆలోచించకుండా, వీలైనంత ఎక్కువ ఫోకస్‌ విలక్షణత వైపు పెట్టేవాడు. అందుకే…

అమీర్‌ఖాన్‌ అంటే బాలీవుడ్‌లో ఒకప్పుడు చాలామందికి గౌరవం. పెద్ద స్టార్‌ అయినా, విలక్షణ సినిమాలవైపు మాత్రమే మొగ్గు చూపేవాడు. కమర్షియల్‌ సక్సెస్‌ల గురించే ఆలోచించకుండా, వీలైనంత ఎక్కువ ఫోకస్‌ విలక్షణత వైపు పెట్టేవాడు. అందుకే అమీర్‌ఖాన్‌ని 'మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌' అని అంటారు బాలీవుడ్‌లో. ఎవరితోనూ అతనికి వివాదాలుండేవి కాదు. 

కానీ, అనూహ్యంగా అమీర్‌ఖాన్‌ రూటు మార్చేశాడు. కావాలనే వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మొన్న అసహనం వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా అమీర్‌ఖాన్‌ పేరు మార్మోగిపోయిన విషయం విదితమే. ఆ అసహనం అమీర్‌ఖాన్‌కి తెచ్చిపెట్టిన చెడ్డపేరు అంతా ఇంతా కాదు. స్టార్‌ని గనుక తాను ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్నది అమీర్‌ఖాన్‌ భావన కావొచ్చుగాక, కానీ దేశం పరువు బజార్న పడేసేలా అమీర్‌ఖాన్‌ బాధ్యతారాహిత్యంతో చేసిన ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. 

ఇక, తాజాగా సల్మాన్‌ఖాన్‌ మీద సెటైర్లు వేశాడు మీడియాకి అమీర్‌ఖాన్‌. 'సల్మాన్‌ఖాన్‌ వస్తే, స్టార్‌ని చూసినట్లు చూస్తారు మీరు.. అదే నేను వస్తే, నన్ను వెయిటర్‌లా ట్రీట్‌ చేస్తారు..' అంటూ మీడియాకి సెటైర్‌ వేసేసరికి, మీడియా ప్రతినిథులు షాక్‌కి గురయ్యారు. అమీర్‌ఖాన్‌ ఇంత 'లేకితనం' ఎలా ప్రదర్శిస్తున్నారు.? అని మీడియా ఆశ్చర్యపోయింది. ఎంతైనా నటుడు కదా, మీడియా ప్రతినిథులు అవాక్కవడాన్ని పసిగట్టేశాడు, 'వెయిటర్స్‌..' అంటే వేరే అర్థం తీయవద్దనీ, సైలెంట్‌గా వుండేవారన్నది తన ఉద్దేశ్యమనీ, అలా సైలెంట్‌గా వుండేవారే గొప్పవాళ్ళనీ కవర్‌ చేసేసేశాడు అమీర్‌ఖాన్‌. 

అంటే, స్టార్‌ అనేవాడు గొప్ప కాదు.. సైలెంట్‌గా వుండేవాళ్ళే తనలాంటి గొప్పవాళ్ళని అమీర్‌ఖాన్‌ ఉద్దేశ్యమా.? ఏదిఏమైనా, అమీర్‌ఖాన్‌కి ఏదో అయ్యింది. అదేమిటన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఊరికినే కెలికేసుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్‌ కూడా అంతే. ఎందుకిలా.? అసలు ఈ ఖాన్స్‌కి ఏమయ్యింది.?