వైఎస్ కాంగ్రెస్ నేత జగన్ కు పాపం, మాట్లాడడం రాదు. మన ప్రభుత్వం వస్తుంది. ప్రజలకు మంచి చేస్తుంది. అధికారంలోకి వస్తాం. అని నేరుగా పదే పదే చెబుతారు. సామాజిక జన సంక్షేమమే పరమావధిగా పని చేసే మీడియా.. చూసారా? జగన్ కు ఎంత అధికార దాహమో? పదే పదే అధికారంలోకి వస్తా.. అధికారంలోకి వస్తా..' అంటాడు అంటూ ఎండ గడుతుంది.
అదే బాబుగారు మరో ముఫై ఏళ్లు అధికారం మాదే అన్నా, చినబాబుగారు మరో పాతికేళ్లు అధికారం మాదే అన్నా, అస్సలు అధికార దాహం కిందే కనిపించదు. అదంతా ఆత్మవిశ్వాసంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లు అధికారం చెలాయించినా, ఇంకో ముఫై ఏళ్లు అధికారంలో వుండాలని బాబు కోరుకోవచ్చు. అది అధికారం యావ కాదు. అస్సలు ఒక్కసారి కూడా ఇంకా అధికారం అందుకోని జగన్ మాత్రం పొరపాటున అనకూడదు.
బాబుగారి మాటల చాతుర్యం చూడండి..'చాలా మంది పెట్టుబడి దారులు నన్ను అడుగుతున్నారు. 2019లో మీరు మళ్లీ అధికారంలోకి రాకపోతే మా పరిస్థితి ఏమిటి?' అని. వారందరికీ నేను భరోసా ఇస్తున్నాను. 2019లో నేను మళ్లీ అధికారంలోకి వస్తాను'.
ఇవీ బాబుగారి మాటలు. పెట్టుబడి పెట్టిన వాడు ఏ ప్రభుత్వం వస్తే ఎందుకు భయపడాలి? ఈ ప్రభుత్వంతో ఏదో లాలూచీ వుంటే, ప్రభుత్వం మారుతుందని భయపడాలి. అంతే కానీ, ఫ్యాక్టరీనో, సంస్థనో పెట్టి నడిపేవాడికి ఏ ప్రభుత్వం అయితే ఏముంది? ఆ సంగతి అలా వుంచితే, కేవలం ఆ పెట్టుబడి దారుల ప్రయోజనం కోసం అన్నట్లుగా బాబుగారు తానుమళ్లీ అధికారంలోకి వస్తా అంటున్నారు. అంతే కానీ పాపం, ఆయనకు అధికారయావ లేదు.
మరి ఇప్పుడు జగన్ ఇలా అనడం మొదలు పెడితే అప్పుడు బాబుగారి అను'కుల' మీడియా ఏమంటుందో? 'చాలా మంది పెట్టుబడి దారులు నన్ను అడుగుతున్నారు. మీరు అధికారంలోకి ఎప్పుడు వస్తారు? అప్పుడు మేము పెట్టుబడులు పెడతాము అని.. వారికి నేను చెబుతున్నాను 2019 అధికారంలోకి వస్తాను' ఇలా కనుక జగన్ అంటే ఏమంటారు. అదిగో చూసారా? పెట్టుబడిదారులతో లాలూచీ పడుతున్నారు. ఇప్పటి నుంచే పెట్టబడిదారులతో మిలాఖత్ అవుతున్నారు అని ప్రచారం మొదలెడతారు.
ఏం చేస్తాం, మన మీడియాలో అధికశాతం ఇలా అఘోరించిన తరువాత భరించడం తప్ప చేసేది లేదు.