అన్న రాజకీయాల్లో మాంచి పోజిషన్ లో వున్న సమయం. పైగా వందల కోట్ల ఆస్తులు. అలాంటి అన్న కొడుకుతో సినిమా తీసి, తమ్ముడు నష్టపోయాడు. పరిస్థితులు విషమించాయి. బ్యాంకులకు, ఫైనాన్సియర్లకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. అందరు హీరోల మాదిరిగానే ఆ హీరో కూడా దెబ్బతిన్న నిర్మాత బాబాయ్ అయినా కూడా ఆదుకోలేదు. అలాంటి టైమ్ లో తమ్ముడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మూడు కోట్లు సర్దుబాటు చేసాడు.
కట్ చేస్తే.. ఏళ్లు గడిచాయి. టైమ్ మారింది. ఎప్పుడో లక్షల్లో పెట్టిన పెట్టుబడి కోట్లుగా మారి తిరిగివచ్చింది. ఒకటి కాదు రెండు కాదు 39కోట్లు ఒకే సారి ఫుల్ వైట్ గా వచ్చింది. దాంతో చేసిన సాయం మరచిపోకుండా మూడు కోట్లు తీసుకెళ్లి తమ్ముడికి ఇచ్చి బాకీ తీర్చేసాడు అన్న.
ఇది కొణిదెల వారి ఇంటి సంగతి అన్నది ఇండస్ట్రీ గుసగుస. ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయిన నాగబాబును అప్పట్లో పవన్ ఆదుకున్నాడు. ఆ మధ్య మా టీవీని స్టార్ గ్రూప్ కు అమ్మేసినపుడు నాగబాబు వాటా కూడా అందులో వుందని తెలుస్తోంది. అలా అమ్మగా 39కోట్ల వైట్ అమౌంట్ వచ్చినట్లు తెలుస్తోంది.
అలా వచ్చిన వెంటనే నాగబాబు మూడు కోట్ల రూపాయలు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కు ఇచ్చి చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మరో చిన్న చితకా బాకీలు కూడా తీర్చేసినట్లు తెలుస్తోంది.
అప్పట్లో ఆదుకున్న పవన్ గ్రేట్ అంటే, నాగబాబును పిలిచి మరీ తన డేట్ లు కేటాయించి, ఆ డేట్ లను లగడపాటి శ్రీధర్ సినిమాకు ఇచ్చేలా చేసి, దానికి రాయల్టీ వచ్చేలా చేసిన బన్నీ కూడా గ్రేట్ నే. కానీ హిట్ ల ట్రాక్ లో పడిన రామ్ చరణ్ మాత్రం ఓ సినిమా చేసి తను కూడా గ్రేట్ అనిపించుకునేది ఎప్పుడో అన్న కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.