సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వోద్యోగుల బదిలీల విషయంలో పైరవీలను అనుమతించమనే చెపుతుంది. కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు పార్టీ సమావేశాల్లో 'మీరు సిఫార్సులు చేసి మాకు తలకాయనొప్పులు తెచ్చిపెట్టకండి' అంటూ ఉంటారు. కానీ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి 16న ఏకంగా ఒక ఆర్డరే విడుదల చేసేసింది. టీచర్ల బదిలీ విషయంలో బిజెపి నాయకులు తమ బంధువుల పేర్లను సిఫార్సు చేసుకోవచ్చు అని.
దాన్ని ఎలాటి ఫారంలో నింపి పంపాలో దాని ప్రొఫార్మా కూడా విడుదల చేసింది. ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు తమ యొక్క, తమ బంధువులైన టీచర్ల ట్రాన్స్‌ఫర్ రిక్వెస్టులను విద్యాశాఖకు ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఈ ఆర్డరును టీచర్ల సంఘాలే కాక ప్రతిపక్షాలు కూడా తప్పుపట్టాయి. కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అశోక్ పర్నామీకి దీనిలో తప్పేమీ కనబడలేదు. 'ఇవి ప్రతిపాదనలు మాత్రమే. అంతిమంగా నిబంధనల ప్రకారమే ప్రతీదీ జరుగుతుంది' అన్నాడు.
ఇలాటి వింత ఆదేశాన్ని జారీ చేయడానికి కారణం – రాజస్థాన్ ఉపయెన్నికలలో బిజెపి ఘోర పరాజయం. ముఖ్యమంత్రి వసుంధరా రాజె బిజెపి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదని, ఆమెను మార్చివేయాలని యిద్దరు బిజెపి నాయకులు బహిరంగంగా డిమాండ్ చేశారు. అందువలన బిజెపి నాయకుల మాటకు విలువ నిస్తున్నానని చూపుకోవడం వసుంధరకు అత్యవసరమైంది. ఇక రెండోది టీచర్ల విషయంలోనే ఎందుకు యిలా చేశారంటే దానికీ ఓ నేపథ్యం ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వసుంధర సంకల్పయాత్ర నిర్వహించింది.
దానిలో చేసిన అనేక వాగ్దానాలలో కొత్తగా 15 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి. బిజెపి ఆ ఎన్నికలలో మొత్తం 200 సీట్లలో మూడింట రెండు వంతుల కంటె ఎక్కువగా 163 సీట్లు గెలుచుకుంది. మరుసటి ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మొత్తం సీట్లూ గెలుచుకుంది. ఇంత మద్దతు ఉన్నా వసుంధర ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో! పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండాలని, కార్మిక చట్టాలను సడలించింది.
దాని ప్రకారం ఏ పరిశ్రమైనా సరే ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా 300 మంది కార్మికుల ఉద్యోగాలు తీసిపారేయవచ్చు. పైగా ప్రభుత్వ రంగంలోని సీనియర్ సెకండరీ, హైయ్యర్ సెకండరీ స్కూళ్లను ప్రైవేటు పరం చేయాలని తలపెట్టింది. ఇది టీచర్లను భయపెట్టింది. మొత్తం 7 లక్షల ప్రభుత్వోద్యోగులలో 3 లక్షల మంది టీచర్లే. తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందని భయపడిన టీచర్లు ఉపయెన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.
అజ్మేర్, అల్వర్ లోకసభ సీట్లలో, మండల్‌గఢ్ అసెంబ్లీ సీటులో మూడు చోట్లా గతంలో గెలిచిన బిజెపి జనవరి 29న జరిగిన ఉపయెన్నికలలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినా ఓడిపోయింది. అల్వర్‌లో 2014లో జస్వంత్ యాదవ్ దాదాపు 2 లక్షల తేడాతో నెగ్గాడు. ఇప్పుడతను వసుంధర కాబినెట్‌లో కార్మికమంత్రి అయ్యాడు. ఈ ఎన్నికలో నిలబడితే యించుమించు అదే తేడాతో కాంగ్రెసు అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ గెలిచాడు.
అక్కడే 2017 ఏప్రిల్‌లో గోరక్షకులు పెహలూ ఖాన్ అనే పశువుల వ్యాపారిని చంపిన ఘటన జరిగింది. కాంగ్రెసు తన ప్రచారంలో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఏం మాట్లాడకపోయినా అక్కడున్న ముస్లిము ఓటర్లు తమకు ఎలాగూ ఓటేస్తారన్న ధైర్యం కాబోలు. ఆ నియోజకవర్గంలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్నిటా కాంగ్రెసుదే లీడ్. జస్వంత్ తన సొంత నియోజకవర్గమైన బెహరోర్‌లో కూడా 23 వేల తేడాతో వెనకబడ్డాడు. అల్వర్‌లో గతంలో జరిగిన 8 ఎన్నికలలో 3 సార్లు బిజెపి గెలిచింది. కాంగ్రెసు ఈసారి 57% ఓట్లు తెచ్చుకోగా బిజెపికి 40% మాత్రమే వచ్చాయి.
అజ్మేర్‌లో కాంగ్రెసు అభ్యర్థి రఘు శర్మ బిజెపి అభ్యర్థి స్వరూప్ లాంబా ని 84 వేల తేడాతో ఓడించాడు. అక్కడా 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కదానిలోనూ బిజెపి లీడ్‌లో లేదు. అజ్మేర్‌లో జరిగిన 8 ఎన్నికలలో 6 సార్లు బిజెపి గెలిచింది. 2014లో 55% ఓట్లు తెచ్చుకున్న బిజెపి యీసారి 44%తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెసు 40% నుంచి 51%కి ఎగబాకింది. రాజపుత్రులు జనాభాలో 9-10% ఉంటారు.
వారి తరఫున పోరాడుతున్నామనే కర్ణిసేనను తృప్తి పరచడానికి బిజెపి నానా తంటాలూ పడింది. ''పద్మావత్''కు సెన్సార్ సర్టిఫికెట్టు లభించినా, సుప్రీం కోర్టు ఆదేశించినా సినిమా ప్రదర్శనను రాజస్థాన్‌లో నిషేధించారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అయిదిటిలో కూడా అదే పరిస్థితి. అయినా కర్ణిసేన చల్లబడలేదు. దేశంలో తక్కిన చోట్లయినా ఎందుకు ప్రదర్శించన నిచ్చారని బిజెపిపై కోపం పెంచుకుంది. ఉపయెన్నికలలో కాంగ్రెసుకే మా మద్దతు అని ప్రకటించింది. రాజపుత్రులు గణనీయమైన సంఖ్యలో ఉన్న అజ్మేర్‌లో కాంగ్రెసు విజయానికి అది ఎంతవరకు దోహదపడిందో చెప్పలేము కానీ సినిమా రాజకీయాల వలన బిజెపి బావుకున్నది ఏమీ లేదని తోస్తోంది.
మండల్‌గఢ్‌లో కాంగ్రెసు అభ్యర్థి వివేక్ ధకడ్ బిజెపి అభ్యర్థి శక్తి సింగ్ హాడాని 12 వేల తేడాతో ఓడించాడు. కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి గోపాల్ మాలవీయ రంగంలో ఉండడం వలన మెజారిటీ తగ్గిందని పార్టీ వాపోయింది. ''గత నాలుగేళ్లగా కాంగ్రెసు స్థానిక ఎన్నికలలో గెలుస్తూనే ఉంది. మేం నెగ్గడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కారణమైతే యింత భారీ మెజారిటీ వచ్చేది కాదు, కాంగ్రెసు తమను ఆదుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు'' అన్నాడు పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలెట్. నిజానికి 2017 సెప్టెంబరులో సిపిఎంకు చెందిన ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన 16 జిల్లాలలో 13 రోజుల ఆందోళన చేపట్టినపుడు కాంగ్రెసు దానితో కలిసిరాలేదు. ఇప్పుడు మాత్రం తాము నెగ్గితే రైతులకు ఋణమాఫీ చేస్తానంటోంది.
అభ్యర్థుల ఎంపికతో సహా అనేక స్థానిక అంశాలు ఉపయెన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. సాధారణ ఎన్నికలు యివే ధోరణిలో జరుగుతాయన్న నమ్మకం లేదు. అయితే వ్యక్తులుగా యీ ఫలితాలు వసుంధర, సచిన్‌లను ప్రభావితం చేశాయి. కాంగ్రెసు పార్టీలో సచిన్ ఖ్యాతి యినుమడించగా వసుంధర విమర్శల పాలైంది. ఆమెను మార్చాలని కొందరు నాయకులు, ముఖ్యంగా ఆరెస్సెస్‌కు చెందివారు, పట్టుబట్ట సాగారు. కానీ ఆమె మార్పును సహించదు.
వచ్చే ఎన్నికలలో కూడా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయకపోతే విడిగా వెళ్లి పార్టీ పెట్టుకుంటుందేమనన్న భయం కూడా బిజెపి వర్గాల్లో ఉంది. ఆమెకంటూ రాష్ట్రంలో బలమైన వర్గం ఉంది. మహిళల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ ఐదేళ్ల క్రితం నాటి మ్యాజిక్ మళ్లీ పునరావృతం చేయగలదని ఎవరూ గట్టిగా అనే పరిస్థితి లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]