జైళ్లో 50 రోజులు.. దిలీప్ కు నో బెయిల్

మొన్నటివరకు గ్రాండ్ గా 50 రోజులు, వంద రోజుల వేడుకలు చేసుకున్న హీరో అతడు. అలాంటిది ఇప్పుడు జైళ్లో 50రోజులు పూర్తిచేసుకున్నాడు. అవును.. మలయాళీ నటుడు దిలీప్ అరెస్ట్ అయి 50రోజులు అవుతోంది. ఇప్పటివరకు…

మొన్నటివరకు గ్రాండ్ గా 50 రోజులు, వంద రోజుల వేడుకలు చేసుకున్న హీరో అతడు. అలాంటిది ఇప్పుడు జైళ్లో 50రోజులు పూర్తిచేసుకున్నాడు. అవును.. మలయాళీ నటుడు దిలీప్ అరెస్ట్ అయి 50రోజులు అవుతోంది. ఇప్పటివరకు అతడికి బెయిల్ దక్కలేదు. తాజాగా కేరళ హైకోర్టు మరోసారి దిలీప్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

నటి భావన కిడ్నాప్ వ్యవహారంలో కీలక నిందితుడిగా మారాడు దిలీప్. ఆమె కారును హైజాక్ చేయించడంతో పాటు, కదిలే కారులో లైంగిక వేధింపులకు పాల్పడేలా చేశారనే ఆరోపణలపై జూలై 10న అరెస్టయ్యాడు దిలీప్. అప్పట్నుంచి ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు.

అటు ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న పల్సర్ సునీ… రోజురోజుకు పోలీసులకు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో దిలీప్ కు బెయిల్ రావడం మరింత కష్టతరమైంది.

నటిపై దాడి జరిగిన సమయంలో పల్సర్ సునీతో పాటు మిగతా నిందుతులు మొబైల్ ఫోన్ తో చిత్రీకరించారని, ఆ మెమొరీ కార్డును పోలీసులే స్వాధీనం చేసుకున్నారని దిలీప్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఆ మెమొరీ కార్డు తమ దగ్గర లేదని అంటున్నారు.

దాన్ని దిలీప్ కు చెందిన వ్యక్తులే నాశనం చేశారని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 2 వరకు దిలీప్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది కోర్టు.