టాలీవుడ్ లో ఒక్కోసారి భలే చిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి హ్యాపీ డేస్. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా యూత్ ఓ ఊపు ఊపేసింది. మళ్లీ పదేళ్ల తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి కూడా కుర్రాళ్లను పట్టి లాగేస్తోంది. చిత్రంగా ఈ రెండు సినిమాలకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి. రెండు సినిమాలు ఇంజినీరింగ్, మెడికల్ క్యాంపస్ ల నేపథ్యంలో తయారైనవే.
రెండిటినీ రూపొందించింది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి ఫిలిం కోర్సులు చేసి, తిరిగి వచ్చిన కుర్రాళ్లే. ఆ సంగతులు అలా వుంచితే, రెండు సినిమాలు కూడా విడుదలకు బాగా స్ట్రగుల్ అయ్యాయి. విడుదల కష్టమైన దశలో హ్యాపీడేస్ సినిమాను డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ రోజుల్లో ధైర్యం చేసి కొన్నారు. ఆయనకు ఈ సినిమా బంగారు బాతుగుడ్లు పెట్టింది. నిర్మాత, దర్శకుడు శేఖర్ కమ్ములకు పేరు తెచ్చింది, మరిన్ని అవకాశాలు తెచ్చింది కానీ, లాభాల్లో వాటా మాత్రం కాదు.
అలాగే అర్జున్ రెడ్డి కూడా అంతే. విడుదలకు స్ట్రగుల్ అయితే, ఏసియన్ సునీల్, ఆయన మిత్రులు కలిసి నాలుగు కోట్లు నలభై లక్షలకు కాస్త అటు ఇటుగా తీసేసుకున్నారు. విడుదల చేసారు. ఇప్పుడు ఇది బంగారు బాతు గుడ్లు పెడుతోంది. ఈ సినిమాకు కూడా దర్శకుడు ఆయన కుటుంబీకులే నిర్మాతలు. వాళ్లకు పేరు వచ్చింది కానీ పైసలు కాదు.
టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఇది. కష్టపడి మంచి సినిమా తీయడం వరకు చేయగలుగుతున్నారు. కానీ బడా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల లీజు దారుల అండ లేకుండా సినిమాను జనాల్లోకి పంపలేకపోతున్నారు. దాంతో అయిన కాడికి సినిమాను అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే ఒకటే ఆనందం. తమ సినిమా జనంలోకి వెళ్లింది. పేరు వచ్చింది. తరువాత చాన్సుల్లో డబ్బులు కళ్ల చూడవచ్చు.
ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఇప్పుడు కుర్రాళ్లకు హ్యాపీడేస్ వచ్చాయి.