ఎయిర్ టెల్ ఏమాత్రం తగ్గడం లేదు. జియో ఇస్తున్న ఉచిత 4జీ హ్యాండ్ సెట్స్ కు పోటీగా తను కూడా అత్యాధునిక 4జీ మొబైల్ ఫోన్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జియో అందిస్తున్న సెల్ ఫోన్లు కంటే మెరుగైన టచ్ స్క్రీన్ పోన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీపావళికి తన సరికొత్త ప్రణాళికను ఆవిష్కరించే ఆలోచనలో ఉంది ఈ సంస్థ.
ఉచిత సిమ్ కార్డులతో ఇప్పటికే తమ సబ్ స్క్రైబర్ల సంఖ్యను 13కోట్లకు పెంచుకుంది జియో. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఇవ్వబోతున్న 4జీ హ్యాండ్ సెట్లతో మరో 10కోట్ల మంది కస్టమర్లను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీనికి పోటీగా ఎయిర్ టెల్ కూడా 2500రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్స్ ఇవ్వబోతోంది.
జియో సంస్థ హ్యాండ్ సెట్ కోసం 1500రూపాయలు వసూలు చేసి మూడేళ్ల తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించబోతోంది. కానీ ఎయిర్ మాత్రం ఈ రాయితీ ఇవ్వడం లేదు. 2500రూపాయలకు అత్యాధునిక టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్ ను రాయితీ లేకుండా ఇవ్వాలనుకుంటోంది. ఈ మేరకు కార్బన్, లావా లాంటి మొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
జియో ఫోన్ తో పోలిస్తే, ఎయిర్ టెల్ ఇవ్వబోయే ఫోన్ లో మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, పెద్ద స్క్రీన్ ఉంటాయి. తామిచ్చే ఫోన్లలో ఎయిర్ టెల్ సిమ్ వేసుకుంటే ఇక మరో కంపెనీ గురించి ఆలోచించే అవసరం ఉండదంటోంది ఎయిర్ టెల్. ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ వినూత్న పథకంపై ప్రకటన వచ్చే అవకాశముందని ఎయిర్ టెల్ అధికారులు అంటున్నారు.
మరోవైపు జియో రాకతో టెలికం రంగంలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. జులై నెలకు సంబంధించి టెలికం చందాదారుల గణాంకాలు విడుదలకాగా.. వోడా ఫోన్ నుంచి 13లక్షల 89వేల మంది, ఐడియా నుంచి ఏకంగా 23లక్షల 20వేల మంది కస్టమర్లు తప్పుకున్నారు. వీళ్లలో అత్యధికులు జియో వైపు మళ్లగా.. మిగిలిన చందాదారులు ఎయిర్ టెల్ కనెక్షన్ తీసుకున్నారు.