టాలీవుడ్ కాదు మరే వుడ్డయినా విజయం వెనుక పరుగెడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ వెనుక పరుగెట్టడం పెద్ద వింతా కాదు, విడ్డూరం కాదు. ఫస్ట్ సినిమా, ఆ తరువాతి సినిమాల సంగతి ఎలా వున్నా, ఎవడే సుబ్రహ్మణ్యంతో మాంచి పేరు వచ్చింది. అయినా సరైన సినిమా పడలేదు. బంధువులే పూనుకుని, కొందరితో కలిసి పెళ్లి చూపులు సినిమా ప్రారంభించారు. అది కూడా కొన్ని ఇబ్బందులు అధిగమించి పూర్తయింది. అప్పుడు కుర్రాడి మీద అందరి దృష్టి పడింది.
కానీ వెంటనే చేసిన ద్వారక డిజాస్టర్ అయింది. కారణం మరేం లేదు. సినిమాకు మాంచి ఖర్చు పెట్టారు. భారీ పబ్లిసిటీ చేసారు. కానీ సబ్జెక్ట్..? కుర్రకారుకు నచ్చేది కాదు. విజయ్ దేవరకొండ లాంటి ఏజ్ గ్రూప్ హీరోలను, ప్రేక్షకులు ఏ జోనర్ లో చూడాలనుకుంటున్నారో, ఆ జోనర్ కాదు. ఇది కీలకంగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరెవరో విజయ్ కు ఆఫర్లు ఇవ్వొచ్చు.. అతను చేయచ్చు. కానీ జోనర్ ను, సబ్జెక్ట్ ను చూసుకోకుండా మళ్లీ ద్వారక లాంటి అనుభవాలు ఎదురవుతాయి.
కుర్రాళ్లు డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్లు చేస్తే, యూత్ తమను పోల్చుకుని ఆనందిస్తారు. ఉయ్యాల జంపాలలో రాజ్ తరుణ్ అయినా, కార్తికేయలో నిఖిల్ అయినా, ఏమాయ చేసావేలో నాగ్ చైతన్య అయినా కుర్రాళ్లు ఆ పాత్రల్లో తమను చూసుకోవడం వల్లనే అవి అంత విజయం సాధించాయి. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన డైరక్టర్లు ఈ తరహా క్యారెక్టర్లను తయారుచేయడం కష్టం. బొమ్మరిల్లు భాస్కర్ కావచ్చు, మరెవరైనా కావచ్చు. సీనియర్లు ఎవరూ యూత్ పల్స్ పట్టుకోలేరు. గౌతమ్ మీనన్, మణిరత్నం, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లు వేరు.
అందువల్ల విజయ్ సబ్జెక్ట్ ల కన్నా ముందుగా డైరక్టర్ల విషయంలో కేర్ ఫుల్ గా వుండాలి. ఆ తరువాత సబ్జెక్ట్ లు చూసుకోవాలి. లేదూ అంటే ఇప్పటికే ఇండస్ట్రీలో వున్న అనేక కుర్ర హీరోల్లో ఒకరిగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనిపించుకుంటాడు తప్ప, అర్జున్ రెడ్డిలా డిఫరెంట్ అనిపించుకోడు. సో, ఇండస్ట్రీ జనాల పట్ల, వాళ్లు ఇచ్చే ఆఫర్ల పట్ల బీ కేర్ ఫుల్ విజయ్.