అదే మాటపై రామ్ చరణ్

సైరా సినిమా విషయమై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ లేదా సాయం అందించే విషయంలో రగడ జరుగుతోంది. ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ విషయంలో కోర్టులో ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే,…

సైరా సినిమా విషయమై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ లేదా సాయం అందించే విషయంలో రగడ జరుగుతోంది. ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ విషయంలో కోర్టులో ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే, నిర్మాత రామ్ చరణ్ మాత్రం చాలా కచ్చితమైన ఆలోచనతో వున్నారని తెలుస్తోంది.

గతంలో ఆయన బహిరంగంగా వెల్లడించారు. తాను ఏమైనా ఇవ్వాలనుకుంటే నరసింహారెడ్డి ప్రాంతానికి, లేదా ఊరికి ఇస్తానని, అక్కడ అభివృద్ది పనులకు సహకరిస్తానని, అంతేకానీ, కొంతమంది వ్యక్తులకు ఇవ్వనని స్పష్టంచేసారు. ఇప్పటికీ ఆయన అదే స్టాండ్ మీద వున్నట్లు తెలుస్తోంది.

రెండురోజుల క్రితం రామ్ చరణ్ 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడుతూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసారు. తాను ఇప్పటికే ఆ ప్రాంతం అవసరాలపై ఆరా తీసానని, కొన్ని పనులు చేపట్టే ఆలోచనలో వున్నానని, కొన్ని పనుల ప్రతిపాదనలు ప్రభుత్వమే చేపడుతోందని ఆయన వివరించారు.

ఒక గొప్ప వ్యక్తి కుటుంబానికి చెందినవారు ఎందరో వుండొచ్చని, వారిలో కొందరికి ఏదో చేసి, ఏదో ఇచ్చి చేతులు దులుపుకునే కన్నా, ఆ వ్యక్తి పేరు చెప్పి, ఆ ప్రాంతానికి ఎంతో కొంత చేయడం సరియైన పని తనకు అనిపించిందని, అందుకే ఆ నిర్ణయానికి వచ్చానని అన్నారు.

వాస్తవంగా ఆలోచిస్తే, రామ్ చరణ్ నిర్ణయం కూడా సబబే అనిపిస్తుంది. ఈ సినిమా పేరు చెప్పి, ఉయ్యలవాడ నరసింహారెడ్డి పుట్టి పెరిగిన రేనాడు ప్రాంతంలో ఏమైనా పనులు చేస్తే, అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. మరికొన్ని తరాలు ఉయ్యాలవాడ పేరు జనాలకు గుర్తుంటుంది. మరి కోర్టు నిర్ణయం ఎలా వుంటుందో? ఏం వస్తుందో? చూడాలి.

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ