బన్నీ-మహేష్.. ఢీ అంటే ఢీ

టాలీవుడ్ కు సంబంధించినంత వరకు, లేదా సినిమా ప్రియులకు సంబంధించినంత వరకు అద్భుతాలు ఏముంటాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం లేదా టాప్ హీరోల సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడడం, రికార్డులు, కలెక్షన్లు…

టాలీవుడ్ కు సంబంధించినంత వరకు, లేదా సినిమా ప్రియులకు సంబంధించినంత వరకు అద్భుతాలు ఏముంటాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం లేదా టాప్ హీరోల సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడడం, రికార్డులు, కలెక్షన్లు ఇవేగా.

2020 సంక్రాంతికి భారీ సినిమాలు ఢీ కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి వున్న వార్తల ప్రకారం 10న రజనీ 'దర్బార్', 11న మహేష్ 'సరిలేరు', 12న బన్నీ 'అల' సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవికాక, కళ్యాణ్ రామ్, విశాల్ ల సినిమాలు కూడా వున్నాయి.

వాస్తవానికి తెరవెనుక చాలా పంచాయితీలు జరుగుతున్నాయి. తాము 11న వస్తామని, మీరు 14న రండి అని మహేష్ సినిమా నిర్మాతలు బన్నీ సినిమా నిర్మాతలకు ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. కానీ బన్నీ సినిమా యూనిట్ వైపు నుంచి తమ సినిమా 12న విడుదల అనే ఫీలర్ కమ్ గ్యాసిప్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ యూనిట్ అదే డేట్ మీద ఫిక్స్ అయిపోయింది.

దాంతో తమ సినిమా 14న వేసుకుందాం అని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిపాదించినట్లు గ్యాసిప్ వచ్చింది. కానీ లేటెస్ట్ సమాచారం ఏమిటంటే, ఏమయితే అయింది, బన్నీ సినిమా విడుదల ఎప్పుడు వుంటే అదేరోజు మహేష్ సినిమా కూడా వేసేయాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు తాత్కాలికంగా డిసైడ్ అయిపోయారని వినిపిస్తోంది. బన్నీ సినిమా యూనిట్ సైడ్ నుంచి కూడా 'వస్తే రానీ' అనే ఆలోచన, ధీమా వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

బన్నీ యూనిట్ మాత్రం వెనక్కు తగ్గేదిలేదు అనే ధోరణిలోనే వున్నట్లు తెలుస్తోంది. ఇప్పడప్పుడే ఈ పంచాయితీ తేలదు, డిసెంబర్ ఆఖరు వారం వరకు ఇది ఇలాగే వుంటుంది. అందువల్ల తాము అనుకున్న 12న డేట్ మీదే వుండాలని డిసైడ్ అయ్యారని బోగట్టా.

ఇదిలా వుంటే రెండు సినిమాలు కూడా చకచకా రెడీ అవుతున్నాయి. బన్నీ-త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 10 నాటికి టాకీ మొత్తం పూర్తి చేసుకుంటుంది. అక్కడికి పాటలు మాత్రం వుంటాయి. అలాగే మహేష్-అనిల్ రావిపూడి సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ కాపీ రెడీ కావడంలో మహేష్ సినిమానే ముందు వుంటుందని తెలుస్తోంది.

మొత్తానికి ఈ సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి ముడే పడింది. 

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ