మెర్సాల్ సినిమా పై పడ్డ రాజకీయ క్రీనీడలు సెన్సారును కూడా ప్రభావితం చేస్తున్నట్లుంది. మెర్సాల్ తమిళ సినిమా విడుదలవుతుండగానే తెలుగు కోసం కూడా అక్కడే తమిళ నిర్మాతే సెన్సారు కోసం చెన్నయ్ లోనే దరఖాస్తు చేసారు. ఆన్ లైన్ లో లోడ్ చేసారు. దీపావళి కాగానే చూసేసారు.
కానీ ఇంతలోనే జీఎస్టీపై మెర్సాల్ డైలాగుల రగడ ప్రారంభమైంది. సినిమా జనాలు, రాజకీయ నాయుకులు నానా హడావుడి మొదలయింది. దీని ప్రభావమో, మరి కేంద్రం నుంచి ఏమైనా అనధికార ఆదేశాలు వచ్చాయో కానీ, సెన్సారు జనాలు సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. అలా అని ఇవ్వనని చెప్పడంలేదు. రేపు ఇస్తాం.. రేపు ఇస్తాం అంటున్నారు.
మరి ఈ రేపు అన్నది ఇప్పుడు మూడు రోజులుగా వినిపిస్తోంది. సినిమా ఈ శుక్రవారం విడుదల కావాలి. సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వడానికి తమిళ నిర్మాత మురళి కిందా మీదా అవుతున్నారు. కానీ సెన్సారు జనాలు రేపు ఇస్తాం అనేమాట తప్ప మరోమాట మాట్లాడడం లేదని తెలుస్తోంది. సినిమా విడుదల కాకపోయినా సమస్య ఏమీలేదని, మీరేం వర్రీకావద్దని తమిళ నిర్మాత తెలుగు ప్రొడ్యూసర్ శరత్ మరార్ కు అభయం ఇచ్చారట.
తమిళ వెర్షన్ పెద్ద హిట్ అయిందని, అందువల్ల ఫైనాన్షియల్ గా తను హ్యాపీ అని, అందువల్ల తెలుగు వెర్షన్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ పై వర్రీ ఏమీవద్దని తమిళ ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారట. తనకు డబ్బులు గురించి టెన్షన్ ఏమీలేదని, తమిళ నిర్మాత చాలా మంచి వ్యక్తి అని, ఆయన తనతో తరచు టచ్ లో వున్నారని, ఎటొచ్చీ మంచిసినిమాను తెలుగులో అందిద్దాం అనుకుంటే ఆటంకాలు ఎదురవుతున్నాయని శరత్ మరార్ పేర్కోన్నారు.