'జై హింద్' అనే నినాదమే దేశంలో కొందరికి ఇష్టంలేని పరిస్థితి. 'భారత్ మాతా కీ జై' అని నినదించడానికి ఆ కొందరికి 'మతం' అడ్డు వచ్చేస్తోంది. సరిహద్దుల్లో తుపాకీ చేతపట్టి, దేశం కోసం ప్రాణాలొడ్డే సైనికుడికి కులంలేదు, మతంలేదు, ప్రాంతంలేదు.. కానీ, ఆ సైనికుడు అలా దేశాన్ని రక్షిస్తోంటే, స్వేచ్ఛగా దేశంలో బతుకుతోన్న మనలో 'కొందరికి' మాత్రం, దేశభక్తిని చాటుకోవడానికి 'మతం' అడ్డంకిగా మారిపోతోంది.
ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా 'జాతీయ గీతం' చర్చనీయాంశమయ్యింది. గత కొంతకాలంగా, సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన జరుగుతోంది. ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిల్చుంటున్నారు. ఇది సుప్రీం ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చింది. దాదాపు ఏడాది క్రిందటి విషయమిది. అప్పట్లోనే ఈ విషయమై పెద్దయెత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్.. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే ప్రేక్షకులు, జాతీయ గీతాన్ని థియేటర్లలో ఆలపించినప్పుడు ఎలా వ్యవహరిస్తారు.? తగురీతిలో జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వకపోతే, అది తప్పుడు సంకేతాల్ని పంపుతుంది కదా.? వంటి ప్రశ్నలు తెరపైకొచ్చాయి. జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడలేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కోణంలో గొడవలు జరిగిన సందర్భాలనేకం. మళ్ళీ ఇప్పుడు, ఆ జాతీయ గీతాలాపన విషయమై సర్వోన్నత న్యాయస్థానం మరోకీలక ఆదేశాన్నిచ్చింది.
దేశ ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి సినిమా థియేటర్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడం గమనార్హం. జాతీయ గీతానికి సంబంధించి నిబంధనల సవరణ అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించడంతో మళ్ళీ ఇప్పుడు భిన్న వాదనలు తెరపైకొచ్చాయి.
జాతీయ గీతాలాపన ఎక్కడ జరిగినా, దాన్ని గౌరవించాల్సిందే. అది ప్రతి భారతీయుడి విధి. కానీ, జాతీయ గీతాన్ని గౌరవించడం కోసం ఎక్కడంటే అక్కడ ఆ గీతాలాపన చేయాలన్న వాదనే సరైంది కాదు. మొత్తమ్మీద, మరోమారు జాతీయ గీతం విషయమై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మోడీ సర్కార్‌పై కొందరు విరుచుకుపడ్తున్నారు. పనిలో దేశభక్తి మీదా క్లాసులు పీకేస్తున్నారు. జాతీయ జెండాని గౌరవించనివారు, 'జైహింద్', 'భారత్ మాతాకీ జై' అని నినదించడానికే ఇష్టపడనివారూ జాతీయగీతం విషయమై మాట్లాడేస్తోంటే, సగటు భారతీయుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందిప్పుడు.