పెద్ద హీరోలు, మీడియం డైరక్టర్ల కాంబినేషన్ సినిమా విడుదలవుతోంది అనగానే డైరక్టర్ల తరువాత ప్రాజెక్టుల మీద ఫీలర్లు ప్రారంభమవుతాయి. ఎందుకంటే తరువాతి ప్రాజెక్టు గ్యారంటీగా చేతిలో వుండాలనే ఆశ వుండడం సహజం కాబట్టి, పెద్ద హీరోతో చిన్న డైరక్టర్ చేసినా సినిమా క్రెడిట్ హీరోకి వెళ్లిపోతుంది. ఫ్లాప్ అయితే మాత్రం డైరక్టర్ ఖాతాలోకి చేరిపోతుంది.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత డైరక్టర్ బాబీకి సినిమా రావడానికి చాలా టైమ్ పట్టింది. మొత్తం మీద జై లవకుశ లాంటి మాంచి ప్రాజెక్టు దొరికింది. సినిమా విడుదలకు ముందే బాబీ తరువాతి ప్రాజెక్టుపై చాలా వార్తలు వినిపించాయి. బన్నీకి వెళ్లి కథ చెప్పాడని, తరువాత ప్రాజెక్టు బన్నీతోనే కావచ్చన్నది వాటిలో ఒకటి. అది కాదు, బాబీకి తొలుత చాన్స్ ఇచ్చిన రవితేజతోనే మరో సినిమా చేస్తాడని ఇంకో ఫీలర్.
ఇప్పుడు అవేవీ వర్కవుట్ అవుతున్నట్లు లేదు. వట్టి ఫీలర్లుగానే మిగిలిపోయాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. బన్నీ దగ్గర సినిమా చేయడం అన్నది అంత సులువుగా సాధ్యమయ్యేది కాదు.
అందుకే ఏం చేయడమా? ఎవరిని అప్రోచ్ కావడమా? అని బాబీ కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య అనిల్ రావిపూడి ఒకటే కథతో రామ్, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి, రవితేజ దగ్గర సెటిల్ అయినట్లు, బాబీ దగ్గర ఓ కథ వుంది. అదే ఎప్పుడో రవితేజకు చెప్పాడు. ఇప్పుడు దాన్నే నానికి చెబితే ఎలా వుంటుందని చూస్తున్నాడట. కానీ నాని డైరీ 2018 మొత్తం ఫుల్ అయిపోయింది. 2019 కోసం కూడా చాలా మంది వెయిటింగ్ లో వున్నారు.
కనుచూపు మేరలో మరే హీరో కనిపించడం లేదు. దాంతో బాబీ తరువాతి ప్రాజెక్టు ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. జైలవకుశ ముందు వినిపించినవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయేలా వున్నాయి.