మెర్సాల్ హడావుడి మొదలైన తరువాత ఉన్నట్లుండి ట్విట్టర్ లో ఓ సందడి మొదలైంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని, అందుకే సినిమా తెలుగు హక్కులు వున్న శరత్ మరార్ ను డబ్బింగ్ వెర్షన్ హోల్డ్ చేయమన్నాడని వార్తలు తెగ వ్యాపించాయి. గతంలో కత్తి సినిమా విషయంలో కూడా ముందుగా పవన్ పేరు ఇలాగే వినిపించింది. కానీ ఆయన ఇష్టపడలేదు. ఆఖరికి అది అలా అలా చిరు దగ్గరకు చేరింది.
ఇప్పుడు కూడా మెర్సాల్ రీమేక్ అన్నది వట్టి వార్తేనని చెన్నయ్ వర్గాల బోగట్టా. మెర్సాల్ చూసిన అభిమానులకు తమ పవర్ స్టార్ రీమేక్ చేస్తే బాగానే వుంటుందని అనిపించి అలా ఈ వార్తను పుట్టించి వుండొచ్చని తెలుస్తోంది. ఈ విషయమై చెన్నయ్ వర్గాలను ఆరాతీస్తే కూడా అలాంటిది ఏమీలేదని తేలింది. తమను ఎవరు ఏ రీమేక్ రైట్స్ కోసం సంపద్రించలేదని, మెర్సాల్ నిర్మాణ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. తనను కూడా పవన్ ఏమీ ఈ విషయమై అడగలేదని శరత్ మరార్ తన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ సబ్జెక్ట్ ను పవన్ తీసుకుని, ఎన్నికల ముందుకు రెడీ చేస్తే మాంచి మైలేజీ వచ్చేమాట అయితే వాస్తవం. కానీ ఎన్నికల లోగా మరో సినిమా చేసే తీరుబాటు ఆయనకు వుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.