ఎనిమిదేళ్ల వయసులో సినిమా సంగీత ప్రయాణం ప్రారంభించి, పాతికేళ్ల వయసుకే సంగీత దర్శకుడై చకచకా వందకు పైగా సినిమాలకు సంగీతం అందించేసాడు ఎస్ ఎస్ థమన్. అయితే ఆరంభంలో చాన్స్ లు ఎంత బాగా వచ్చాయో, కాస్త బ్యాడ్ నేమ్ కూడా అలాగే వచ్చింది.
కాపీ ట్యూన్ లు అనీ, సేమ్ టు సేమ్ ట్యూన్ లు అనీ విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఇటీవల మళ్లీ సెటిల్ అయ్యారు. ప్రతి సినిమాకు కొన్నయినా కొత్త ట్యూన్ లు ఇవ్వడం, హిట్ ట్యూన్ లు ఇవ్వడంతో థమన్ కు మళ్లీ టైమ్ వచ్చింది. ఈవిషయమే, తొలిప్రేమ ప్రమోషన్లతో బిజీగా వున్న థమన్ ను అడిగితే, అసలు విషయం వివరంగా చెప్పుకోచ్చాడు.
'ఎక్కువగా ఎవరికీ తెలియదు కానీ, అది నా లైఫ్ లో బ్యాడ్ పిరీయడ్. ఒకేసారి సమస్యలు అన్నీ వచ్చాయి. హెవీగా సినిమాలు ఒకపక్క, అదే సమయంలో అమ్మ కోరిక మేరకు ఇంటి నిర్మాణం మరోపక్క స్టార్ట్ అయ్యాయి.
అలాంటి టైమ్ లో బిల్డర్ మోసం చేయడంతో కట్టిన ఇల్లు సీజ్ అయిపోయే పరిస్థితి. రెండుకోట్ల అప్పు. ఇవన్నీ ఒక్కసారి మీదపడ్డాయి. దాంతో సినిమాల మీద, వర్క్ మీద ప్రభావం పడింది. భగవంతుడు దయవల్ల అవన్నీ దాటి వచ్చాను. ఇండస్ట్రీ కూడా అర్థం చేసుకుంది' అని వివరించారు థమన్.
చాలా కాలం తరువాత మంచి ఫీల్ వున్న రీరికార్డింగ్ ఇచ్చే అవకాశం తొలిప్రేమ సినిమాతో దక్కిందని, ఎంత ఫీల్ అంటే డీటీఎస్ చెకింగ్ చేయడానికి వెళ్లి, థియేటర్ వదిలి రాబుద్ది కాలేదని థమన్ అన్నారు. ఈమధ్యకాలంలో ఆరు పాటలు వున్న సినిమాలు చాలా అరుదు అని, తొలిప్రేమలో ఆరు పాటలు వుండడమే కాకుండా, అన్నీ ఇప్పటకే మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయని థమన్ అన్నారు.
సైరా సినిమా టీజర్ కు పని చేసే అదృష్టం దక్కిందని, చిరంజీవి గారు ఒక్క ఫోన్ కాల్ చేసినా, అర్థరాత్రి అయినా వెళ్లి పని చేయడానికి సిద్ధంగా వున్నానన్నారు. సైరాకు ఎవరు పని చేస్తారో తనకు తెలియదన్నారు. పరిశ్రమలో వున్న హీరోలంతా తనంటే అభిమానంతో సాయం చేయడం వల్లనే సమస్యలు అధిగమించి, ఈస్థాయిలో వుండగలిగానని థమన్ అన్నారు.