అదిగో గౌతమ్.. ఇదిగో హీరో

సినిమా సక్సెస్ అయితే చాలు, హీరోల పేర్లతో డైరక్టర్ల పేరు ముడిపెట్టేయడం మన జనాలకు బాగా అలవాటు. ఆ మధ్య పరుశురామ్ పేరు అలాగే ముడిపెట్టేసారు. ఇంతవరకు సినిమా లేదు. గూఢచారి డైరక్టర్ పేరు…

సినిమా సక్సెస్ అయితే చాలు, హీరోల పేర్లతో డైరక్టర్ల పేరు ముడిపెట్టేయడం మన జనాలకు బాగా అలవాటు. ఆ మధ్య పరుశురామ్ పేరు అలాగే ముడిపెట్టేసారు. ఇంతవరకు సినిమా లేదు. గూఢచారి డైరక్టర్ పేరు అలాగే వినిపించింది. ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇలా చాలామంది డైరక్టర్ల పేర్లతో గ్యాసిప్ లు గలగల లాడాయి. కానీ సినిమాలే కనిపించలేదు. 

ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి వంతు వచ్చింది. రామ్ చరణ్ తో సినిమా, వరుణ్ తేజ్ తో సినిమా అంటూ వార్తలు అల్లేయడం మొదలయిపోయింది. కానీ జనాలకు తెలియాల్సింది ఏమిటంటే గౌతమ్ ఇప్పటివరకు, ఈ క్షణం వరకు తరువాత ప్రాజెక్టు మీద దృష్టి పెట్టలేదు. ఎలాగూ తరువాత సినిమా ఎవరికి చేయాలన్నది ఫిక్స్ అయిపోయింది. నిర్మాత ఎన్వీ ప్రసాద్ కే గౌతమ్ సినిమా చేయాలి.

కథ, స్క్రిప్ట్ రెడీ అయితే ఆయన ఏ హీరో దగ్గరకు అయినా గౌతమ్ ను తీసుకెళ్లగలరు. అటు మహేష్ అయినా, ఇటు మెగా హీరోలు అయినా. కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్నాక, తనదగ్గర వున్న కథల్లోంచి మాంచి సేలబుల్ కమర్షియల్ పాయింట్ తీసి, కథ అల్లి, అప్పుడు చెబుతా అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ కు గౌతమ్ మాట ఇచ్చాడట. అంతవరకు వెయిటింగ్ నే. ఈ మధ్యలో ఈ గ్యాసిప్ లతో ఆనందించడమే.

అంత వీజీ కాదు…
నిజానికి గౌతమ్ తో సినిమా అన్నది అంత వీజీ కాదు. సినిమా జనాలకు బయటకు వచ్చినవే కాదు, లోపల ఏం జరిగింది అన్నది కూడా పట్టించుకుంటారు. హిట్ ఒకటే క్రెయిటీరియా కాదు. గౌతమ్ జెర్సీ సినిమా మీద చాలా విషయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా నిర్మాతల మాట గౌతమ్ వినలేదు అన్నటాక్ వుంది. అవుట్ పుట్ ఎడిట్ చేసే విషయంలో నిర్మాతలు అతికష్టం మీద ఎడిటర్ నవీన్ నూలి సాయంతో అవుట్ పుట్ ను సాన పట్టించారని టాక్. నిర్మాత చినబాబు నెలరోజులు ముందుగా రఫ్ వెర్షన్ చూసి, ఏయే కట్ లు చెప్పారో అవేవీ గౌతమ్ చేయలేదని తెలుస్తోంది.

పైగా చెప్పినపుడు, అలాగే, తప్పకుండా, ష్యూర్ అని చెప్పేసి, సైలంట్ గా సినిమాలో సీన్లు అలాగే వుంచేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందువల్ల గౌతమ్ స్క్రిప్ట్ తయారుకావాలి, నిర్మాత ఎన్వీప్రసాద్ కు ఎవరు డేట్ లు ఇస్తారో తెలియాలి. ఆపైన గౌతమ్ స్క్రిప్ట్ పై లెక్కలు తేలాలి. అప్పుడు ఎవరితో, ఎప్పుడు సినిమా అన్నది తేలుతుంది.

ప్రస్తుతానికి వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, చైతన్య, ఇలా ఎవ్వరూ ఖాళీలేరు. అందువల్ల ఈలోగా గ్యాసిప్ ల ముచ్చట తప్ప మరేమీలేదు.

విజయం పట్ల వైసీపీలో పూర్తి విశ్వాసం

నాని నవ్వు వెనుక ఫుల్ కాన్ఫిడెన్స్ అదేనా?