భలే ఫీలర్లు బయటకు వచ్చినట్లున్నాయి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వర్గాల నుంచి. ఎన్టీఆర్..బన్నీ..చరణ్ తమ తమ రెమ్యూనిరేషన్లు తగ్గించుకోవడానికి అంగీకరించారోచ్.. అంటూ వార్తలు పుట్టుకు వచ్చాయి. కానీ ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రచారం అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
టాప్ 6 హీరోలను ఈ బేరసారాల నుంచి మినహాయించారని ముందే వార్తలు బయటకు వచ్చాయి. అంతకు ముందు కూడా సినిమా ఎంప్లాయీస్ అదే విషయం మీద అభ్యంతరం పెట్టారు. కోవిడ్ తరువాత పెద్ద హీరోల రెమ్యూనిరేషన్లు భయంకరంగా పెరిగాయి. మరి తమకు ఎందుకు పెంచరు అన్న వాదన వినిపించారు.
ఇప్పుడు పెద్ద హీరోలను వదిలేసి రావు రమేష్..మురళీ శర్మ లాంటి క్యారెక్టర్ నటుల గురించి మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు వినిపించడం ప్రారంభించాయి.
వీటన్నింటినీ కౌంటర్ చేయడానికి, అలాగే తమ బంద్ ప్రయత్నం అప్పుడే ఫలితాలు ఇస్తోందని ఓ ఇంపాక్ట్ కలుగచేయడానికి ఈ ఎత్తు వేసారని కౌన్సిల్ సభ్యుడు ఒకరు అన్నారు. నిజంగా ఎన్టీఆర్..చరణ్..బన్నీతో మాట్లాడితే ఆ విషయం గిల్డ్ సమావేశాల్లో చెబుతారు కదా..అలా ఏమీ చెప్పలేదే అంటూ ఒక గిల్డ్ సభ్యుడే అన్నారు.
అయినా ఇప్పుడు బన్నీ..చరణ్..ఎన్టీఆర్ ను కలిసినా ఏమంటారు. మా వంతు సహకారం ఇస్తాం అంటారు. అంతే కదా..రెమ్యూనిరేషన్ బేరం ఎవరితో..బన్నీతో సినిమా తీసే మైత్రీతో, ఎన్టీఆర్ తో సినిమా తీసే సుధాకర్ తో అంతే తప్ప దిల్ రాజు ఒక్కరు వెళ్లడం వల్ల ఏమవుతుంది అని మరొకరు అన్నారు. జస్ట్ జరుగుతున్న వ్యవహారాలు బ్రీఫింగ్ ఇవ్వడం తప్ప పెద్ద హీరోల దగ్గర మరే డిస్కషన్లు వండవు అన్నది వాస్తవం.
ఇదిలా వుంటే కాస్ట్ కటింగ్ కమిటీ ఈ రోజు సమావేశం అయింది. ఇకపై సింగిల్ డోర్ క్యారవాన్ లు ఇవ్వరాదని, ఏ కేరవాన్ ఇస్తే అదే నటులు తీసుకోవాలని ఓ పాయింట్ నోట్ చేసారు. అలాగే ఇళ్లకు ఇకపై బళ్లు పంపించి షూటింగ్ కు రప్పించడం మానేయాలని, ఎవరి స్వంత ట్రాన్స్ పోర్ట్ లో వాళ్లే రమ్మని కోరాలని మరో పాయింట్ నోట్ చేసారు.
డిస్కషన్లకు, బ్రీఫింగ్ లకు, ఇతరత్రా వాటికి కూడా ఇళ్లకు కార్లు పంపే పద్దతి మారాలని అనుకున్నారు. మరో మరోసారి గురువారం సమావేశం అవుతారు.