సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి ఎన్నికల్లో పోటీ చేశాడా.? ఈ అనుమానం చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా, ఆ సంగతి చాలామందికి తెలియదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు పోసాని.
ఆ తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌కి దగ్గరయినా, ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరనే చెప్పాలి. అయితే, 2014 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనతో పోసాని వున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ కొత్త పార్టీ పెడ్తారట, టీడీపీలోకి వెళ్తారట.. అంటూ వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో మీడియా ముందుకొచ్చి, అదంతా తూచ్.. అనేసారు పోసాని.
పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకీ, పోసాని ఖండనకీ.. ఎలా లింకు పెట్టగలం.? పవన్‌కి అత్యంత సన్నిహితుడిగా పోసాని ఈ ఎపిసోడ్‌తో ప్రచారం చేసుకోగలిగారనే చెప్పాలి. మీడియా పోసానికి అలా ఫోకస్ ఇచ్చింది. ఎటూ పవన్ సన్నిహితుడన్న ఇమేజ్ పడిరది కాబట్టి, ఎన్నికల్లో తనకు కలిసొస్తుందన్నది పోసాని ఆలోచన కావొచ్చు.
అయితే, రాజకీయాలపై పోసానికి ఖచ్చితమైన అభిప్రాయం వుంది. డబ్బు పంచితే తప్ప ఎన్నికల్లో గెలవలేమన్నది ఆయన భావన. ‘నేను ఖర్చుపెట్టను, కాబట్టి గెలవడం కష్టం..’ అని ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇంతకీ, పోసాని 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారా.? ఏ పార్టీ నుంచి.? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.