అజ్ఞాతవాసి ఎఫెక్ట్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై కాస్త గట్టిగానే పడబోతోంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో తారక్ సినిమాలో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ విషయంపై నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ ను ఏమీ అనలేదు కానీ, ఈ దర్శకుడే ఎన్టీఆర్ కోసం రాసిన స్క్రీన్ ప్లేను మరోసారి సమీక్షించుకోవాలనుకుంటున్నాడు. దీంతో పాటు టెక్నికల్ టీమ్ లో కూడా మార్పుచేర్పులు జరిగే అవకాశముంది.
ఇందులో భాగంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ బయటకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా సంగీతంలో మరీ క్లాసికల్ టచ్ కనిపించింది. త్రివిక్రమ్ సూచనల మేరకే అనిరుధ్ అలాంటి కంపోజిషన్స్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ సినిమాకు మరీ అంత శాస్త్రీయ పద్ధతిలో వెళ్తే కుదరదు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండాలి.
అలా అని అనిరుధ్ మాస్ బాణీలకు పనికిరాడని కాదు, కాకపోతే ఎన్టీఆర్ కు ఈమధ్య దేవిశ్రీప్రసాద్ పై బాగా గురి కుదిరింది. దేవి తన సినిమాలో ఉంటే రిజల్ట్ బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నాడు. అటు దేవిశ్రీ లేకపోవడం వల్లనే అజ్ఞాతవాసి రిజల్ట్ తేడాకొట్టిందనే సెంటిమెంట్ కూడా నడుస్తోంది. సో.. తమ తాజా ప్రాజెక్టు కోసం అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ దేవిశ్రీని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా లాంఛింగ్ కు అనిరుధ్ కూడా వచ్చాడు. వచ్చేనెల నుంచి ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని అంతా అనుకుంటున్న టైమ్ లో ఈ టాక్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్టులో అనిరుధ్ ఉంటాడా ఉండడా..? మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.