'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అన్నాడో కవి. 'వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖమున్నదీ' అన్నాడు మరో కవి. నిజమే…కష్టాలొస్తే ఎన్నాళ్లని విచారిస్తూ కూర్చుంటారు. బాధపడుతూ ఎంత కాలం వృథా చేస్తారు? కొన్ని కష్టాలు తీరడానికి సమయం పడుతుంది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాంటప్పుడు ఏడుస్తూ బుర్ర పాడుచేసుకోవడంకంటే ప్రయోజనకరమైన పని చేయడం మంచిది. కొత్త విద్య నేర్చుకుంటే ఇంకా మంచిది. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న దివంగత జయలలిత ప్రాణ సఖి శశికళ అలియాస్ చిన్నమ్మ ఉపయోగపడే పనే చేస్తోంది.
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఈమె ఏదోవిధంగా బయటపడాలని శతవిధాల ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో బాధను దిగమింగుకొని మనసు స్థిమితం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈమె ఉపయోగపడే పని ఏం చేస్తోంది? కన్నడ భాష నేర్చుకుంటోంది. ఈమె ఒక్కతే కాదండోయ్. సహ దోషి అయిన వదినగారు ఇళవరసి కూడా ఉంది. ఎప్పుడైనా మాతృ భాషతోపాటు ఇతర దేశీయ, విదేశీ భాషలు నేర్చుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శశికళ మౌనవ్రతంలో ఉంది కాబట్టి ఉపాధ్యాయులు అడుగుతున్న ప్రశ్నలకు నోటితో సమాధానం ఇవ్వడంలేదు. భాషను త్వరగా నేర్చుకుంటోందని మెచ్చుకుంటున్నారు. ఇదొక్కటే కాదు..కంప్యూటర్ తరగతులకు కూడా హాజరవుతోంది.
ఆమె జైలుకు వెళ్లకపోతే ఈ రెండు విద్యలు నేర్చుకునేది కాదుగదా. జైలు జీవితం ముగిసేసరికి ఈ విద్యల్లో ఆరితేరవచ్చు. పదో తరగతి వరకు చదువుకున్న శశికళకు మాతృభాష తమిళం మాత్రమే వచ్చు. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేసిన ఈమె జీవితాన్ని మలుపు తిప్పింది జయలలితతో పరిచయం. ఆ తరువాత కథ తెలిసిందే. నిజానికి ఇప్పటి జైళ్లు పూర్వకాలంనాటి జైళ్ల మాదిరిగా లేవు. చిప్పకూడు తినడమనేదానికి అర్థం లేదు. అంతంతమాత్రం చదువులున్నవారు నేరం చేసి జైలుకు వెళ్లాక ఉన్నత విద్యావంతులుగా తిరిగొస్తున్నారు. జైల్లో ఉండి డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్నవారున్నారు. వృత్తుల్లో నిష్ణాతులుగా మారినవారున్నారు. గాంధీ, నెహ్రూ తదితర మహా నాయకులు జైళ్లలో ఉండి ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలు రాశారు.
ఈమధ్య లైంగిక వేధింపుల ఆరోపణపై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్ అక్కడ గజళ్లు పాడుతూ తోటి ఖైదీలను ఆనందపరుస్తున్నాడు. ఇప్పటికి మూడునాలుగుసార్లు ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో బాధను పక్కకు పెట్టి గజళ్లు పాడుతున్నాడు. ఒకప్పుడు 'సత్యం కంప్యూటర్స్' అంతర్జాతీయంగా టాప్ కంపెనీ. దాని అధినేత రామలింగరాజు జైల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు విషాదంలో మునిగినా తరువాత తేరుకొని కొన్ని కవితలు రాశారు. నిజానికి ఆయన కవి కాదు. కాని జైలు జీవితం కవిగా మార్చింది.
ఏదో ఉబుసుపోక కవితలు రాసి ఊరుకోలేదు. ఆయన భార్య ఆ కవితలను పుస్తకంగా తెస్తే ఈయన కవిత్వమేంటో చదువుదామని సాహిత్యాభిమానులు బాగానే కొన్నారట. అగ్గిపుల్లను, సబ్బుబిళ్లను, కుక్కపిల్లను తక్కువగా చూడొద్దని, అవి కూడా గొప్పవేనని శ్రీశ్రీ చెప్పారు కదా. జైలు కూడా అంత గొప్పదే. ఈ రోజల్లో జైలుకు పోవడం (ముఖ్యంగా రాజకీయ నాయకులు, సంపన్నులు) పెద్ద అవమానం కింద ఎవ్వరూ భావించడంలేదు. పూర్వకాలంలో మాదిరిగా కష్టాలూ లేవు. డబ్బులు పడేస్తే సర్వసౌఖ్యాలు లభిస్తున్నాయి. పెద్దోళ్లు జైలుకు వెళ్లినా ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. జైలుకు వెళితే పోయేదేంలేదు. కొత్త విద్యలు వస్తాయి.