అజ్ఞాతవాసి కలెక్షన్ కబుర్లు అనూహ్యం!

అజ్ఞాతవాసి బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రోత్సాహకరంగా లేదనే సంగతి ఇప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చేసింది. కాకపోతే.. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అనే విపరీతమైన నమ్మకంతో.. భారీ అంచనాలకు వెళ్లి.. పెద్ద పెద్ద…

అజ్ఞాతవాసి బాక్సాఫీసు వద్ద పెద్ద ప్రోత్సాహకరంగా లేదనే సంగతి ఇప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చేసింది. కాకపోతే.. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అనే విపరీతమైన నమ్మకంతో.. భారీ అంచనాలకు వెళ్లి.. పెద్ద పెద్ద రేట్లకు సినిమా ప్రదర్శన హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు దానికి తగినట్లుగానే దెబ్బ పడినట్లుగా సమాచారం అందుతోంది.

తొలి ఆరురోజుల కలెక్షన్ వివరాలు అందిన తర్వాత.. సంక్రాంతి సెలవుల సీజన్ కూడా ముగిసిపోయిన నేపథ్యంలో.. ఒకసారి పరిస్థితి ఏమిటో అంచనా వేస్తోంటే.. కలెక్షన్ కబుర్లు చాలా అనూహ్యంగానూ, దారుణంగానూ కనిపిస్తున్నాయి.

1) ‘అజ్ఞాతవాసి' సినిమాకు భారీగా నష్టపోయేది నైజాం డిస్ట్రిబ్యూటరే అంటున్నారు. నైజాంలో ఈ చిత్రాన్ని రూ. 27కోట్ల పైచిలుకు ధరకు అమ్మారు. తొలి 6రోజుల్లో ఈచిత్రం ఇక్కడ కేవలం రూ. 10కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. సంక్రాంతి పండగ సీజన్ కూడా ముగియడంతో ఇకపై వసూళ్లు మరింత పడిపోవడం ఖాయం అని పలువురు అనుకుంటున్నారు.

2) సీడెడ్ ఏరియాలో ‘అజ్ఞాతవాసి' రైట్స్ రూ. 15కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే ఇక్కడ తొలి 6రోజుల్లో కేవలం రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగా నష్టం తప్పేట్లు లేదు.

3) ‘అజ్ఞాతవాసి' నెల్లూరు రైట్స్ రూ. 4కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే తొలి 6రోజుల్లో ఇక్కడ రూ. 2.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక్కడ కూడా భారీ నష్టమే అంటున్నారు.

4) గుంటూరు ఏరియాకు గాను అజ్ఞాతవాసి రైట్స్ రూ. 9కోట్లకు అమ్మినట్లు సమాచారం. అయితే ఇక్కడ తొలి 6రోజుల్లో రూ. 4.81 కోట్లు మాత్రమే వసూలైంది.

5) కృష్ణ ఏరియా రైట్స్ దాదాపు రూ. 7కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 2.8 కోట్లు మాత్రమే వసూలైంది.

6) వెస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 6 కోట్ల పైచిలుకు అమ్మారు. ఇక్కడ అజ్ఞాతవాసి చిత్రం తొలి 6రోజుల్లో రూ. 4.2 కోట్లు వసూలు చేసింది.

7) ఈస్ట్ గోదావరి ఏరియా రైట్స్ రూ. 8.5 కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే తొలి 6రోజుల్లో ఇక్కడ ఈ చిత్రం రూ. 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

8) ఉత్తరాంధ్ర ఏరియాలో ‘అజ్ఞాతవాసి' థియేట్రికల్ రైట్స్ రూ. 11కోట్ల పైచిలుకు అమ్మారు. అయితే తొలి 6రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 4.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఇప్పటి వరకు అజ్ఞాతవాసి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 37కోట్ల షేర్ (రూ. 58.20 గ్రాస్) వసూలు చేసింది. ఈ దెబ్బతిన్న చిత్రాన్ని పవన్ స్టామినా ఎంత మేరకు నిలబెడుతుందో.. ఫ్యాన్స్ ఎంత దూరం లాగగలరో వేచిచూడాలి.