హోయ్ చోయ్…బెంగాలీ రీజినల్ ఆన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్. ఇదే ఇప్పుడు తెలుగు లో కొత్తగా సందడి చేయాలనుకుంటున్న ఆహా..ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ కు స్ఫూర్తి. కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు, ప్రస్తుతానికి టెక్నాలజీ పార్టనర్. భవిష్యత్ లో కంటెంట్ పార్టనర్ కూడా. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5, సన్ నెక్ట్స్ ల సరసన మరో ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా రంగంలోకి దిగింది.
నిన్నటికి నిన్న లాంచ్ అయిన ఫస్ట్ తెలుగు ఆన్ లైన్ స్ట్రీమింగ్ పోర్టల్ ఆహా. మై హోమ్, గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు దీని ఫేస్. తెర వెనుక భాగస్వాములు ఇంకా చాలా మందే వున్నారన్నది టాక్. అల్లుఅరవింద్ ప్రసంగంలో కూడా ఇదే చెప్పారు. ఇంకా చాలా ఎగ్జయిటింగ్ పార్టనర్ లు వున్నారని, వారిని లాంచింగ్ డేట్ అయిన ఉగాది నాడు పరిచయం చేస్తామని ఆయన అన్నారు. ఈ ఎగ్జయిటింగ్ భాగస్వాముల్లో తెలుగు వాళ్లు వున్నారు, నార్త్ ఇండియన్స్ వున్నారు అని టాక్.
ఇదిలా వుంటే తెలుగులో బోల్డ్ కంటెంట్ ను అందించడమే 'ఆహా' ను క్లిక్ చేయడానికి దగ్గర దారి అని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. పేరెంటెల్ గైడెన్స్ తోనే యాప్ ను వుంచుకోవాలని, అల్లు అరవింద్ మరీ మరీ చెప్పేసారు. తమ యాప్ లో కంటెంట్ పక్కా బోల్డ్ కంటెంట్ అని చెప్పడానికి మొహమాటపడడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేసారు. ఆహా కు స్ఫూర్తి అయిన బెంగాలీ హోయ్..చోయ్ కూడా ఇదే దారిలో వుంది
ఆహా ఫ్లాట్ ఫారమ్ లో డైరక్టర్ క్రిష్ అందిస్తున్న మస్తీ వెబ్ సిరీస్ ట్రయిలర్ కూడా ఈ తరహాలోనే అనిపిస్తోంది. అమెజాన్ లాంటి దిగ్గజాలతో పోటీ పడాలి, అదే సమయంలో కేవలం తెలుగు కంటెంట్ తో నెట్టుకు రావాలి అంటే ఈ బోల్డ్ అనే అడ్డదారి తొక్కక తప్పదు అని డిసైడ్ అయిపోయారేమో? మన తెలుగు జనాలకు మన తెలుగు నటులతో, బాలీవుడ్ లో వస్తున్న అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ఇక దర్శనం ఇవ్వబోతున్నాయన్నమాట.