పవర్ స్టార్ అభిమానులకు ఏ టెన్షన్ లేదు. అజ్ఞాతవాసి అనుకున్నది అనుకున్నట్లు, అనుకున్న టైమ్ కు విడుదలవుతుందట. మీడియాలో వినిపిస్తున్నట్లు టీ సీరీస్ తో కాపీ రైట్స్ విషయంలో ఏ వివాదమూ లేదని, అంతా ప్రశాంతం అని, అలా అని మీడియాలో వచ్చిన ప్రతి వార్తను తాము ఖండించుకుంటూ, అదే పనిగా పెట్టుకోమని అంటున్నాయి హారిక హాసిని యూనిట్ వర్గాలు.
తమకు ఇప్పుడు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే టెన్షన్ అని, చెన్నయ్ లో మిక్సింగ్, రీ రికార్డంగ్, ముంబాయిలో సిజి వర్క్, డిజిటల్ కరెక్షన్, హైదరాబాద్ లో డబ్బింగ్, తలో చోటా తలో పని జరుగుతున్నందున, అన్నీ కలిపి కో ఆర్డినేట్ చేసుకోవడంతో సరిపోతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ట్రయిలర్ పనులు అంతా పూర్తయినా, సెన్సారు ఇంకా కాలేదని, సెన్సారు ఆఫీసరు మారిపోయి, కొత్త అధికారికి చార్జి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో అజ్ఞాతవాసి ట్రయిలర్ విడుదలలో జాప్యం తప్పలేదని ఆ వర్గాలు తెలిపాయి.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డైరక్టర్ త్రివిక్రమ్ బిజీగా వున్నందున, ప్రచార కార్యక్రమాలు ఇంకా షురూ చేయలేదని, అన్నీ ఒకటి రెండురోజుల్లో సెట్ అవుతాయని ఆ వర్గాలు వివరించాయి.