జనవరి ఫస్ట్ వీకెండ్ లో విడుదలకు ప్లాన్ చేసుకుంది పవన్-త్రివిక్రమ్ కాంబో అజ్ఞాతవాసి సినిమా. అయితే ఈ సినిమా అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ హారిక హాసిని సంస్థ మాత్రం పక్కాగా షూటింగ్ జరుగుతోందని, సమస్య ఏదీ లేదని అంటున్నట్లు సమాచారం.
వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇంకా కనీసం యాభై రోజుల షూటింగ్ వుందని తెలుస్తోంది. కానీ హారిక హాసిని సంస్థ మాత్రం 30రోజులే షూట్ వుందని అంటున్నట్లు వినికిడి.
పోనీ అదే వాస్తవం అనుకున్నా, ఈ ముఫై రోజులు ఏక ధాటిగా సాగే షెడ్యూలు కాదు. ఇందులో యుకె పాటల షెడ్యూలు కూడా వుంది. షెడ్యూలుకు, షెడ్యూలుకు మధ్య గ్యాప్ లు, మధ్యలో హీరో, డైరక్టర్ ల అవసరాలు ఇవన్నీ కలుపుకుంటే కనీసం 50 వర్కింగ్ డేస్ కచ్చితంగా అవసరం. అంటే నవంబర్ చివరి వరకు టాకీ షూట్ వుంటుదని అనుకోవాలి.
అక్కడికి పోస్ట్ ప్రొడక్షన్ కు ఇక మిగిలేది కేవలం 30 రోజులు మాత్రమే. మామూలుగా అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు 30 రోజులు ఎక్కువే. కానీ త్రివిక్రమ్ లాంటి క్వాలిటీ కోరుకునే డైరక్టర్లు, పవన్ నటించే 150కోట్ల రేంజ్ సినిమాకు అంటే మాత్రం కాస్త టైట్ పొజిషనే. పైగా ఈ మధ్యలో పవన్ భార్య డెలివరీ, రాజకీయాలు ఇత్యాది వ్యవహారాలు వుండనే వున్నాయి. అక్కడ ఏ మాత్రం గ్యాప్ వచ్చినా, పోస్ట్ ప్రొడక్షన్ కు వున్న నెలరోజుల సమయం తగ్గిపోతుంది.
అసలే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేరు. అందువల్ల అజ్ఞాతవాసికి రిలీజ్ డేట్ ను మీట్ అవ్వడం అన్నది కాస్త టెన్షన్ తో కూడుకున్న వ్యవహారమే.