దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తానని అంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు రాజకీయ రంగు కొత్తగా పులమాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన పరిణామాల గురించి సినిమా రూపొందిస్తానని వర్మ ప్రకటించడంతోనే టీడీపీ ఉలిక్కిపడింది.
వర్మ ఆ సినిమాను నిజంగా పూర్తి చేస్తాడో లేదో ఎవరికీ తెలియదు కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దానిపై స్పందించింది. వర్మను ఏపీ, తెలంగాణలో తిరగనివ్వమని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించడం.. దానికి ప్రతిగా వర్మ ఘాటుగా స్పందించడం..‘ఏపీ, తెలంగాణలు మీ బాబువా?’ అని ప్రశ్నించడం జరిగింది.
ఆ వెంటనే లేట్ చేయకుండా వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి రచ్చ రేపాడు. టైటిల్ కు తగ్గట్టైన ఫస్ట్ లుక్ తో వర్మ తనలో క్రియేటివిటీ ఇంకా చచ్చిపోలేదని అందరికీ చాటి చెప్పాడు. అయితే.. ఈ సినిమా ముందుకు వెళ్తుందా? వెళ్లదా? అనేది మాత్రం సందేహమే ఇంకా.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు నిర్మాతను కూడా వర్మ పరిచయం చేశాడు. అతడి పేరు పి.రాకేష్ రెడ్డి అట. ఇతడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అని తెలుస్తోంది. వర్మ ఈ విషయాన్ని కూడా చెప్పాడు. అయితే సినిమాను మాత్రం రాజకీయాలకు అతీతంగా రూపొందిస్తామని, కేవలం నిజాలను చూపుతూ సినిమాను తీస్తామని.. వర్మ అంటున్నాడు. మరి ఈ సినిమా తెరకెక్కడం అంటూ జరిగితే.. అటు సినిమాగా, ఇటు రాజకీయంగా మంచి వినోదమే!