రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం మాట అటుంచి, ముందుగా కాస్త హాయిగా రిలాక్స్ కావడానికి హిమాలయాలకు వెళ్లబోతున్నారట. ఈ మేరకు తమిళనాట వార్తలు గుప్పుమన్నాయి. అయితే రజనీ ఫ్యాన్స్ పాజిటివ్ గానే తీసుకుంటున్నారు దీన్ని. విపరీతమైన వత్తిడి, కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నపుడల్లా, హిమాలయాలకు వెళ్లి, ప్రశాంతంగా ధ్యానం చేసుకుని, ప్రశాంతత ఆవరించిన తరువాత వెనక్కు వస్తారని అంటున్నారు.
ప్రస్తుతం రజనీ చేస్తున్న కాలా సినిమా పూర్తి కావచ్చింది. ఈ సినిమా ప్రమోషన్, విడుదల వ్యవహారాలు పూర్తయ్యాక వెళ్తారా? సినిమా పూర్తి కాగానే వెళ్తారా? అన్న దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. రజనీ కౌంటర్ పార్ట్ గా భావించే కమల్ హాసన్ చకచకా రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కానీ కమల్ కన్నా ముందుగానే రాజకీయాల వైపు మొగ్గు చూపిన రజనీ మాత్రం, ఇంకా పూర్తిగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రజనీ, భాజపా కలిసి పనిచేస్తారని ఊహాగానాలు వున్నాయి. మరి రజనీ ఏ విధంగా తన కార్యాచరణ రూపొందించుకుంటారో చూడాలి.
తమిళనాట ఇప్పడు అచ్చంగా సమైక్యాంధ్ర చివరి రోజుల మాదిరిగా రాజకీయ అనిశ్చితి నెలకొని వుంది. పాలన దాదాపు స్థంభించిందని చెన్నయ్ వర్గాల బోగట్టా. చిరకాలంగా వున్న డిఎమ్కే, అన్నాడిఎమ్కే ల నుంచి ప్రజల చూపు కొత్త పార్టీల వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిస్థితిని రజనీ, కమల్ లో ఎవరు క్యాష్ చేసకుంటారో చూడాలి. ఇప్పటికైతే కమల్ నే దూకుడుగా, చురుగ్గా వ్యవహరిస్తున్నారు.