గంటల వ్యవధిలో 2 సినిమాల విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు. నాగ్ ప్రకటించిన కొన్ని గంటలకే నాని కూడా తన కొత్త సినిమా విడుదల తేదీని ఎనౌన్స్ చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న ఎంసీఏ సినిమాను, అఖిల్ సినిమా కంటే ఒకరోజు ముందు డిసెంబర్ 21న విడుదల చేస్తామని ప్రకటించాడు. దీంతో అఖిల్, నాని సినిమాల మధ్య పోటీ షురూ అయింది.
రీసెంట్ గా నాని నటించిన నిన్నుకోరి సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. నిన్నకోరి సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని గంటలకే, బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన సినిమాను వాయిదా వేసుకున్నాడు నాని. మరి ఇప్పుడు అఖిల్ కోసం నాని మరోసారి వాయిదా బాట పడతాడో లేక పోటీకి సై అంటాడో చూడాలి.
క్రేజ్ పరంగా చూస్తే నాని సినిమాకే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే వరుస విజయాలతో ఊపుమీదున్నాడు ఈ హీరో. అటు మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్, రెండో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.