చిత్ర పరిశ్రమ తరలాల్సిన టైమ్ వచ్చిందా?

తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ వినిపిస్తున్న మాట ఒకటి వుంది. రాష్ట్రం విభజన జరిగితే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోతుందని అనుకున్నారు చాలామంది. కానీ ఇక్కడ విపరీతంగా ఆస్తులు పెంచుకుని, అన్ని విధాలా…

తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ వినిపిస్తున్న మాట ఒకటి వుంది. రాష్ట్రం విభజన జరిగితే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోతుందని అనుకున్నారు చాలామంది. కానీ ఇక్కడ విపరీతంగా ఆస్తులు పెంచుకుని, అన్ని విధాలా ఇన్ ఫా స్ట్రక్చర్ పై పెట్టుబడులు పెట్టేసిన వారు ఎక్కడికీ వెళ్లరనే విషయంపై అవగాహన వున్నవాళ్లు అనుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవహారం. అలాగే అయ్యప్ప సొసైటీ వ్యవహారం లాంటివి జరిగాయి. దీంతో ఆంధ్ర జనాలను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు కలిగాయి. 

కానీ వున్నట్లుండి విషయం మారిపోయింది. ముంచుకు వచ్చిన హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, కేటీఆర్ తో ఆంధ్ర బడా బాబులకు వున్న సాన్నిహిత్యం కావచ్చు, అన్నీ కలిపి, సినిమా ఇండస్ట్రీ అంతా తెలంగాణలో కేసీఆర్ తో, ఆంధ్రలో చంద్రబాబుతో డబుల్ రోల్ డ్యూయెట్లు పాడడం ప్రారంభించింది. దాంతో ఇంక కొత్తగా సమస్యలు లేనట్లే అనుకున్నారు అంతా. 

చెబుతున్నది వేరు.. చేస్తున్నది వేరు

కానీ ఇప్పుడు వున్నట్లుండి డ్రగ్స్ కేసు పీకల మీదకు వచ్చిపడింది. పెద్ద తలకాయలను వదిలేసి చిన్న చేపలను పట్టి పీడిస్తున్నారన్న ఫీలింగ్ మెల్లగా జనాల్లోకి వెళ్తోంది. పైగా గడచిన పది రోజులుగా వీళ్లే డ్రగ్స్ నేరస్థులు అన్నంతగా హడావుడి జరుగుతోంది. కానీ కోర్టు దగ్గరకు వచ్చేసరికి ఎక్సయిజ్ శాఖ ఏం చెబుతోంది. వీళ్లను సాక్షులుగా మాత్రమే పిలుస్తున్నాం అంటోంది. 

పైగా వీళ్లను సాక్షులుగా పిలిచి, బడా బాబుల పిల్లలను వదిలేసారన్న రూమర్లు వున్నాయి. దానికి మద్దుతగా ఇప్పుడు ఎక్సయిజ్ శాఖే ఫీలర్లు వదల్తోంది. విచారణకు వచ్చిన వాళ్లు బడా బాబుల పేర్లు చెబుతున్నారని. అంతేకాదు ఇండస్ట్రీ నిలువుగా, రెండుగా చీలిపోయిందని ఎక్సయిజ్ శాఖ అధికారులే ఫీలర్లు వదులుత్తున్నారు. ఇప్పుడు విషయం కోర్టు మెట్లు ఎక్కింది. ఓ సంస్థ బడాబాబుల పిల్లలు, బడా హీరోల పేర్లు కూడా బయటకు లాగింది. 

పొరపాటునో, గ్రహపాటునో, కోర్టు నుంచి ఆదేశాలు వస్తే అందుకు అనుకూలంగా వ్యవహరించక తప్పదు. అప్పుడు ప్రభుత్వం కూడా బడాబాబుల పిల్లలను కాపాడలేకపోవచ్చు. 

కేసు నిలవదా?
ఇదిలా వుంటే కొత్తగా ఈ రోజు ఏమని పీలర్లు వచ్చాయి? ఫలానా జ్యూస్ తాగి వస్తున్నారు. ఫలానా షాంపూ వాడుతున్నారు. గోళ్లు శుభ్రంగా గీసేస్తున్నారు. కడుపులో ఏమీలేకుండా డీ టాక్సినేషన్ చేయించుకుంటున్నారు. అంటే, వాళ్లకే అనుమానంగా వుందన్నమాట, క్లినికల్ సాక్ష్యాలు ఏవీదొరకవు అని. మరింక కేసులు ఎలా బనాయించగలుగుతారు? ఎలా నిలబెట్టుకోగలుగుతారు. 
కానీ నానా యాగీ, నానా హడావుడి మాత్రం తప్పదు. పెద్ద హీరోల జోలికి వెళ్తే, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. మళ్లీ యూత్ ఓట్లతో సమస్య వస్తుందని అధికార పక్షం సోచాయిస్తోందని టాక్ వినిపిస్తోంది. 

షిప్టింగ్ కు పునాది?
సినిమా ఇండస్ట్రీ షిప్ట్ కావడం అంటే అంత చిన్న విషయంకాదు. ఓవర్ నైట్ జరిగేపని కాదు. మొన్నటికి మొన్న ఆంధ్రమంత్రి లోకేష్ అన్న మాటలు ఇక్కడ గమనార్హం. సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రకు వస్తుందని, అయితే ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా వస్తుందనే అర్థంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మన సినిమా బడా బాబులు నెల్లూరు, గుంటూరు, విశాఖల్లో భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారు. అందువల్ల ఇక సినిమా ఇండస్ట్రీ ఆంధ్రపై దృష్టి పెడుతుందని టాక్ వినిపిస్తోంది.

నివాసం అక్కడ..నిర్మాణం ఇక్కడ
ఇప్పటికీ మన సినిమా జనాలు చెన్నయ్-హైదరాబాద్ ల మధ్య తెగ చక్కర్లు కొడుతుంటారు. ఎందుకంటే చాలా పనులు చెన్నయ్ తో ముడిపడి వుంటాయి కాబట్టి. హైదరాబాద్ నుంచి చెన్నయ్ తిరగడం ఎంతో విశాఖ నుంచి చెన్నయ్ తిరగడమూ అంతే. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ తిరగడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది సినిమా జనాలు విశాఖలో ఇళ్లు, వాకిళ్లు కొన్నారు. అందువల్ల ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి వచ్చే బదులు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి వెళ్తే ఎలా వుంటుందని ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవేవీ ఇప్పటికిప్పుడే జరిగేవి కావు. కానీ బీజాలు పడిన తరువాత ఎప్పుడో అప్పుడు మెులకెత్తడం మామూలే. పైగా ఇప్పట్లో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న ఆశలులేవు.

అందువల్ల ఈ డ్రగ్స్ కేసు తీసుకునే టర్నింగ్ ను బట్టి ఇండస్ట్రీ జనాల ఆలోచనలు వుంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారనే దిశగా ప్రకటనలు రావడం ప్రారంభమైంది. పైగా ఎక్సయిజ్ వాళ్లే ఫీలర్లు వదిలారు. ప్రాంతీయ విబేధాలు చూపిస్తున్నారని అంటున్నారు అంటూ. అది కనుక కాస్త బలంగా వెళ్తే ఎన్నికల్లో ఫ్రభావం చూపించే అవకాశమూ వుంటుంది. పైగా రవితేజ, సుబ్బరాజు లాంటి వాళ్లు అంతా కేటీఆర్ కు హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి మద్దతుగా నిలిచిన వర్గానికి చెందిన వారు. అందువల్ల టీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తుందనే అందరూ అనుకుంటున్నారు.

చార్మి, రవితేజ విచారణలు ముగిసిన తరువాత ఏ విషయమూ ఓ క్లారిటీ వస్తుంది. కొత్తగా నోటీసులు, అది కూడా బడా బాబుల ఫ్యామిలీలకు అందాయి అంటే, ఇండస్ట్రీ ఇక ఈ షిప్టింగ్ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకునే అవకాశం వుంటుంది.