అఖిల్, చేతిలో వున్నవి వదిలేసి, ఆకాశంలో వున్నవాటి వైపు చూసే టైపులా కనిపిస్తున్నాడు. తండ్రి నాగార్జున ఆస్థానంలో వున్న కళ్యాణ్ కృష్ణతో సినిమా చేసుకో అన్నాడు. నో అన్నాడు అఖిల్. సరే వంశీ పైడిపల్లి వున్నాడుగా అన్నారు. అబ్బే అన్నాడు. హను రాఘవపూడి కేసి చూస్తే, తేడా వచ్చింది. కనుచూపు మేరలో డైరక్టర్లు ఎవరు కనిపించడం లేదు.
రెండో సినిమా, ఆచి తూచి అడుగు, జాగ్రత్తగా చేయడం వంటి కబుర్లు మాత్రం వినిపిస్తున్నాయి. తెరవెనుక మాత్రం ఎవరు దొరుకుతారా అని వెదుకులాట సాగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా డైరక్టర్ మారుతిని కూడా చిన్నగా కదిపినట్లు తెలుస్తోంది. మారుతి డైరక్షన్ లో అయితే సినిమా చేద్దామని యువి బ్యానర్ కు కబురు చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాబుబంగారం తరువాత మారుతి ఫ్రీ అవుతున్నారు. బ్యానర్ కమిట్ మెంట్ లు వున్నాయి కానీ హీరో కమిట్ మెంట్ లు అంతగా లేవు. అందువల్ల అఖిల్ గాలమేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మారుతి ఇంత వరకు ఊ..ఆ అనడం లేదు. బంగారం మార్కెట్ లోకి వచ్చాక చూద్దామని అంటున్నట్లు తెలుస్తోంది. బంగారం బ్లాక్ బస్టర్ అయితే మారుతిని బన్నీ పట్టుకుపోతాడని ఇండస్ట్రీ టాక్ వుంది మరి. ఏం జరుగుతుందో చూడాలి.