బాహుబలి సిరీస్ ను పక్కన పెడితే, మన తెలుగు సినిమా పెద్ద హీరోల బిజినెస్ ఆ మధ్య వరకు 60 నుంచి 70 వరకు వుండేది. అయితే ఎప్పుడయితే టికెట్ ల రేట్లపై ఎవరి ఇష్టం వారిదయిందో, కొత్తగా థియేటర్లు, స్క్రీన్ లు పెరిగాయో, ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ కల్చర్ పెరిగిందో, సినిమాల ఆదాయం పెరిగింది.
సినిమాలు హిట్ అయితే చాలు ఇరవై కోట్ల నుంచి 80 కోట్ల వరకు సినిమాల రేంజ్ ను బట్టి వసూళ్లు వుంటున్నాయి. దీంతో మార్కెట్ అర్థం పర్థం లేని హైప్ ఒకటి క్రియేట్ అయింది. కాంబినేషన్ సెట్టింగ్ తోనే ఈ హైప్ క్రియేట్ చేయడం అన్నది మొదలయిపోతోంది.
సినిమా అమ్మకాలు భారీగా వుండడం కోసం సినిమాను భారీగా నిర్మించడం అన్న మరో జబ్బు కూడా మొదలయింది. పోటీలు పడి బాలీవుడ్ నుంచి టెక్నీషయన్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ కొత్త కొత్త కుర్రాళ్లు, మనవాళ్లు లక్షలకే మాంచి సినిమాటోగ్రఫీ అవుట్ పుట్ ఇస్తుంటే, ఆనడం లేదు. ఎక్కడెక్కడి నుంచో సినిమాటోగ్రాఫర్లను తెస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమాటోగ్రాఫర్ కారణంగా ఆ సినిమా బడ్జెట్ భయంకరంగా పెరిగిపోయిందన్నది వాస్తవం.
ఆ ఎక్విప్ మెంట్ అంతా ముంబాయి నుంచే, డిఐ కూడా ముంబాయిలోనే చేయించాలి. తన స్టాఫ్ అంతా ముంబాయి నుంచే, ఆఖరికి కార్మికులు కూడా ముంబాయి నుంచే. వీళ్లందరికీ రాను పోను ఖర్చులు, హైదరాబాద్ లో వసతి. ఒకటి అని కాదు. పైగా మధ్యలో డైరక్టర్ తో తేడా వస్తే, కథ మొదటికి వస్తుంది.
భరత్ అనే నేను సినిమాకు సినిమాటోగ్రాఫర్ మధ్యలో మారిపోయారు. అగ్రిమెంట్ ప్రకారం అతనికి కోటిన్నర, కొత్త అతనికి మళ్లీ కొత్తగా ఎనభై లక్షలు. నిర్మాత నెత్తిన అదనపు భారం. కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే హీరో, డైరక్టర్ ఒకటైపోతున్నారు. నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టడం మినహా చేసేదేమి లేదు. అజ్ఞాతవాసి సినిమాకోసం 80 లక్షలు ఖర్చు చేసి బాలీవుడ్ డ్యాన్స్ డైరక్టర్ ను తెచ్చారు. సినిమాలో డ్యాన్స్ లు ఎలా వున్నాయో చూసారు కదా?
ఇక ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన మరో సమస్య సిజి వర్క్. హీరోను మరింతగా చెక్కడం, పొట్టలు కోయడం తగ్గర నుంచి సినిమాను మరింత భారీగా చూపించడం కోసం సిజి వర్క్ ను ఆశ్రయిస్తున్నారు. మామూలుగా మాంచి లోకేషన్ వెదికేది పోయింది. సిజికి అప్పగించేయడమే. దీనివల్ల కోట్ల భారం, అదనపు వ్యయం. అజ్ఞాతవాసి చూసిన వారికి సిజి వర్క్ ఎక్కడ వుంది అని అనిపిస్తుంది. కానీ బోలెడు సిజి వర్క్ ఫుటేజ్ చేయించారు. కోట్లు ఖర్చు అయింది.
నిజానికి ఇవ్వాళ తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. అదనపు ఆదాయాలు పెరిగాయి. దీనివల్ల 60 కోట్లలో సినిమా తీస్తే, మరో అరవై కోట్లు లాభం మిగిలే అవకాశం వచ్చింది. కానీ హీరో-డైరక్టర్ కలిసిపొయి, తలో ఇరవై లాగేసుకుని, తమకు నచ్చిన వారిని పెట్టించి, వారికి ప్యాకేజీలు ఇప్పించి, ఆఖరికి నిర్మాతకు పది, అయిదు మిగిలిందనిపిస్తున్నారు.
కానీ సినిమా తన్నేస్తే మాత్రం భారం నిర్మాత మీదే పడుతోంది. సింపుల్ గా కావాలంటే డేట్ లు ఇస్తాం మరో సినిమా చేసుకోండి అంటున్నారు. అంతే తప్ప తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కు ఇవ్వడం అన్నది లేనే లేదు. పైగా ఇది చాలదన్నట్లు వెనక్కు ఇచ్చినట్లు ఫీలర్లు వదలడం, దాన్ని పట్టుకుని అభిమానులు ప్రచారం చేయడం.
అసలు ఈ పారితోషికాల మాట వింటే అమ్మో అనిపిస్తుంది. టాప్ హీరోలకు 20నుంచి 25కోట్లు. డైరక్టర్లకు 15 నుంచి 20 కోట్లు. ఇది చాలదన్నట్లు తమకు కావాల్సిన వారినే పెట్టుకోవాలి. తమకు కావాల్సిన వారికే అమ్మాలి. ఇలాంటివి చాలా వుంటాయి. కానీ టాలీవుడ్ నిర్మాతలో కట్టుబాటు అనేది లేదు. దాంతో హీరోలే ప్రాజెక్టులు సెట్ చేయడం, వారే డైరక్టర్లకు నిర్మాతలను అప్పగించడం, అపైన పీల్చి పిప్పి చేయడం.
మరోపక్క కాంబినేషన్లు చూసి, లాటరీ టికెట్ కొన్నట్లు బయ్యర్లు సినిమాలు కొంటున్నారు. పాపం కోట్లకు కోట్లు రాత్రికిరాత్రి పోగొట్టుకుంటున్నారు. ఈ ఏడాది దిల్ రాజు ఏడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. వాటిపై ఎంత లాభం వస్తుందో తెలియదు కానీ, ఒక్క సినిమా పంపిణీపై సుమారు పది కోట్లకు పైగా పోగొట్టుకునేలా వున్నారు.
ఈ ప్రహసనం ఇలా కొనసాగుతూనే వుంటుందా? లేదా బ్రహ్మోత్సవాలు, స్పైడర్లు, కాటమరాయుళ్లు, అజ్ఞాతవాసులు వస్తూనే వుంటాయా?