పవన్ 15 కోట్లు వెనక్కి ఇస్తానన్నాట్ట!

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త పుకారు షికారు చేస్తోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుదల చేయడం వలన భారీగా నష్టపోయే ప్రమాదంలో పడిన డిస్ట్రిబ్యూటర్లకు హీరో మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఓ…

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త పుకారు షికారు చేస్తోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుదల చేయడం వలన భారీగా నష్టపోయే ప్రమాదంలో పడిన డిస్ట్రిబ్యూటర్లకు హీరో మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఓ భరోసా లభించినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని రోజులు వేచిచూసిన తర్వాత.. నిజంగా నష్టపోవడం అంటూ జరిగితే గనుక.. సుమారు 15 కోట్ల రూపాయల వరకు తన రెమ్యునరేషన్ నుంచి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తానని ఆయన మాట ఇచ్చినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజానిజాల సంగతి ఇప్పటిదాకా తేలలేదు. అయితే కేవలం సినీ హీరోగా మాత్రమే కాకుండా, పాజిటివ్ రాజకీయాలను తీసుకురావడానికి ఉద్యమిస్తున్న రాజకీయవేత్తగా కూడా ప్రజల్లో ఇమేజి కలిగి ఉన్న పవన్ కల్యాణ్ తనకు చెడ్డపేరు రాకుండా.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటిదాకా నిర్మాతకు తనవలన వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ లోంచి తిరిగివ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అజ్ఞాతవాసి చిత్రాన్ని కాపీ కొట్టిన కథతో రూపొందించడంతో.. ఫ్రెంచి ఒరిజినల్ చిత్రానికి రీమేక్ రైట్స్ కొనుక్కుని ఉన్న బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ దాన్ని వివాదంగా మార్చడం.. తొలుత బుకాయించే ప్రయత్నం చేసినా.. తర్వాత గత్యంతరం లేక పలుమార్లు చర్చోపచర్చలు జరిపి.. ఓ రేటు ఫిక్స్ చేసుకుని టీసిరీస్ కు ఇచ్చేసినట్లుగా వివాదాన్ని క్లోజ్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. హిందీ రీమేక్ రైట్స్ మొత్తం వారికి ఇచ్చేసినట్లుగా చెప్పుకున్నారు. అటుఇటుగా 10 కోట్ల మేర నిర్మాతకు నష్టం వాటిల్లినట్లు చెప్పుకున్నారు.

దర్శకుడి వైఖరి వల్ల.. సినిమాను అడ్డంగా కాపీ కొట్టేయడం వల్ల ఇలా జరిగినట్లు తేలిపోవడంతో.. తన వల్ల మరొకరు నష్టపోవడం ఇష్టం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత నష్టం వాటిల్లితే అంత (10కోట్లు అయినా సరే) వెనక్కివ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, దర్శకుడితో సత్సంబంధాల కోసం నిర్మాత రాధాకృష్ణ వద్దంటున్నప్పటికీ.. ఆయన తన సెంటిమెంటు కోసం తిరిగి ఇవ్వాలనే అనుకుంటున్నారని వార్తలొచ్చాయి.

ఆ పర్వం పూర్తయ్యాక ఇప్పుడిక నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ‘ఎంతో కొంత తిరిగి ఇచ్చేయడం’ అనేది పవన్ కల్యాణ్ వంతుగా మారినట్లుంది. ఆయన 15 కోట్ల వరకు తిరిగి ఇవ్వనున్నట్లు పుకారు. ఈ చిత్ర నిర్మాణంలో కేవలం రెమ్యునరేషన్లకే 60 కోట్ల వరకు ఖర్చు చేశారుట. సినిమా నిర్మాణానికి మరో 60కోట్లు అయ్యాయిట. అంతా కలిపి టోటల్ గా 122 కోట్లు ఖర్చు చేయగా.. సినిమాను 135 కోట్లకు అమ్మారుట.

ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లకు సాలిడ్ గా 40శాతం నష్టాలు గ్యారంటీ అని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుందో ఏమో. మరి ఈ లెక్కన పవన్ 15కోట్లు ఇచ్చినా అది వారికి కంటితుడుపే తప్ప నష్టాల్లోంచి బయటపడేసే ఛాన్స్ లేదన్నమాట.