ఇది వరకే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లతో, అందాల హీరోయిన్లతో ప్రేమ కథలను నడిపించాడు రణ్ బీర్ కపూర్. ముందుగా దీపికా పదుకునే, ఆ తర్వాత కత్రినా కైఫ్.. ఈ హీరో ప్రేమలో మునిగితేలిన వాళ్లే! కత్రినాతో అయితే రణ్ బీర్ లివింగ్ రిలేషన్ షిప్ కూడా చేశాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ అప్పట్లో లవ్ నెస్ట్ ఒకటి కట్టుకుని జీవించారు.
ఇక పెళ్లే తరువాయి అని వార్తలు వచ్చాయి. రణ్ బీర్ కుటుంబీకులు కూడా కత్రినాను ఓకే చేశారని, మరి కొన్ని నెలల్లో పెళ్లి అని కబుర్లు వినిపించాయి. అయితే అలాంటి కబుర్లు వచ్చిన కొన్ని రోజుల్లోనే వారు బ్రేకప్ ప్రకటించుకున్నారు. లవ్ నెస్ట్ ను ఖాళీ చేసి కత్రినా బయటకు వచ్చింది. అంతవరకూ జంటగా విహరించిన ఈ జంట ఎవరి దారి వారు చూసుకుంది. కత్రినా ఆ తర్వాత అధికారిక బంధాలు ఏవీ నెరపలేదు కానీ, రణ్ బీర్ మాత్రం ఎంచక్కా మరో హీరోయిన్ ను పట్టేశాడు.
ఈ సారి కూడా స్టార్ స్టేటస్ ఉన్న హీరోయినే. అలియా భట్. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజా గాసిప్. అది అధికారిక ప్రకటన ఏమీ కాదు. కానీ…ఇప్పుడు ఈ రూమర్ అయితే వినిపిస్తోంది.
మరి ఈ హీరోయిన్ ను అయినా రణ్ బీర్ పెళ్లి చేసుకుంటాడా అనేది ఒక అనుమానం. అలాగే.. కత్రినాతో పెళ్లి అని ఊహాగానాలు వినిపించినప్పుడే రణ్ బీర్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడు అలియాతో పెళ్లి అని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రేమ కథ కూడా క్లైమాక్స్ కు వచ్చిందా? అనేది ఇంకో సందేహం!