హిట్ ల కోసం మొహం వాచిపోయి వున్నారు అల్లరి నరేష్, సునీల్. నిన్నటి దాకా సునీల్ హీరోయిజం ట్రయ్ చేస్తూ వచ్చాడు. పాటలు, ఫైట్లు ఇలా. అల్లరి నరేష్ మాత్రం హిట్ ల కోసం మెట్లు దిగివచ్చి, తను హీరోగా నటిస్తూ, మిగిలిన కమెడియన్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, వాళ్లమీద ఎక్కువ ఫోకస్ పెడుతూ సినిమాలు చేసాడు. అయినా కూడా ఫలితం దక్కలేదు. అదీ వేరే సంగతి.
ఇప్పుడు సునీల్ కూడా అదే రూట్ లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. టూ కంట్రీస్ టీజర్ చూస్తుంటే అలాగే వుంది. టీజర్ లో సునీల్ కు ఎంత పార్ట్ వుందో మిగిలిన ఫ్యాడింగ్ కమెడియన్లకు కూడా అంతకన్నా ఎక్కువ వుంది. ఆ మాటకు వస్తే, సునీల్ కన్నా వాళ్లు చేసిన హల్ చల్ నే ఎక్కువ వుంది. ఆ మధ్య అల్లరి నరేష్ చేసిన ఒకటి రెండు సినిమాల్లో కూడా ఇలాగే మిగిలిన కమెడియన్లకు పెద్ద పీట వేసారు. ఎవరి వల్ల అయితేనేం హిట్ అంటూ వస్తే చాలు ఖాతాలో వేసుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు.
కానీ అల్లరి నరేష్ ఇలా కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే జనం అల్లరి నరేష్ సినిమాకు వెళ్దాం అని వస్తారు. కానీ అక్కడ అల్లరి నరేష్ కన్నా మిగిలిన కమెడియన్లు ఎక్కువ కనిపిస్తారు. ఇప్పుడు సునీల్ విషయంలో ఈ ఫార్ములా ఏమవుతుందో చూడాలి. ఏమయినా హీరోనా, కమెడియన్లా అన్నది కాదు. కథ, కథనాలు కీలకం. మరి వాటి విషయంలో టూ కంట్రీస్ ఎలా వుంటుందో? వెయిట్ అండ్ సీ.