బంగారపు పళ్లానికైనా గోడ చేర్పుకావాల్సిందే. ఎలాంటి సినిమాకు అయినా విడుదల ముందు రోజు ఫైనాన్స్ క్లియరింగ్ వంటి సమస్యలు తప్పవు. అందులోనూ సాహో లాంటి మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా తీయడం, దాన్ని స్వంతంగా విడుదల చేయడం అంటే మాటలు కాదు.
అమ్మేసి వుంటే చేతిలోకి డబ్బులు వస్తాయి. హ్యాపీగా ఫైనాన్స్ క్లియర్ చేసి, విడుదల చేసుకోవచ్చు. అన్ని వందల కోట్ల నిర్మాణం స్వంతంగా చేయడం అంటే మాటలు కాదు.
అందుకే విడుదల ముందు రోజు సాహో సినిమాకు కూడా ఫైనాన్స్ క్లియరింగ్ సమస్యలు తలెత్తినట్ల బోగట్టా. అయితే యువి అధినేతలకు ఇండస్ట్రీ కింగ్ పిన్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ లతో మంచి సంబంధాలు వున్నాయి. దాంతో ఆ ఇద్దరూ కలిసి ఈ సమస్య గట్టెక్కడానికి సాయం చేసినట్లు తెలుస్తోంది.
బన్నీ వాస్ ద్వారా విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ అర్జెంట్ గా 15 కోట్లు సాయం అందించారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే దిల్ రాజు 10 కోట్ల వరకు సహాయం అందించినట్లు వినిపిస్తోంది. ఈ విధంగా అల్లు అరవింద్ సహాయం చేయడం ఇదే మొదటిసారి అని వినిపిస్తోంది. ఇది కాక, హీరో ఫ్రభాస్ 40 కోట్ల వరకు హామీ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మొత్తం మీద యువి కి వున్న గుడ్ విల్ ద్వారా సాహో విడుదల సమస్యలు లేకుండా సులువు అయిందనే చెప్పాలి. లేదూ అంటే మూడు వందల కోట్ల సినిమా నిర్మించడం, దాన్ని స్వంతంగా విడుదల చేయడం, అది కూడా ఎటువంటి సమస్య లేకుండా అంటే అంత వీజీ కాదు.