ఏదో ఒక రకంగా ప్రతిరోజూ మీడియాలో పత్రికల్లో కనిపిస్తూ ఉండాలనేది.. చంద్రబాబునాయుడు నలభయ్యేళ్లుగా నమ్ముకున్న రాజకీయ సిద్ధాంతం. ఒక్కరోజు పత్రికల్లో తన పేరు కనిపించకపోయినా సరే, ప్రజలు తనను పూర్తిగా మరచిపోతారని ఆయనకు ఒక భయం. ప్రజల్లో తనకు ఎలాంటి గుర్తింపు ఆదరణ ఉన్నదో దాని గురించి పరిపూర్ణమైన నమ్మకం ఉన్న నాయకుడికి అలాంటి భయాలు ఉండవు. ప్రచారాన్ని నమ్ముకుని… వారికి కనిపిస్తూ ఉన్నంతకాలం మాత్రమే తనను గుర్తు పెట్టుకుంటారని భయపడేవారు ఆత్మన్యూనతతో ఉండేవాళ్లని అర్థం.
ఈ ఉపోద్ఘాతం పక్కన పెడితే.. తాజాగా రాష్ట్రంలో వివాదాలేమీ లేకపోయేసరికి చంద్రబాబుకు చిరాకు వచ్చినట్లుగా ఉంది. అందుకే ఆయన మీడియాలో కనిపించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఒక లేఖ రాశారు. వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ అందులో ప్రధానంగా ప్రస్తావించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించలేదంటూ ప్రజల్లో సీఎం పట్ల ఒక అవిశ్వాసాన్ని కల్పించడానికి ఆయన ప్రయత్నించారు.
గోదావరి వరదలు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారని, కృష్ణ వరదలు వచ్చినప్పుడు అమెరికాయాత్రలో ఉన్నారని అందులో పరోక్షంగా దెప్పిపొడిచారు. ఇక్కడ సహాయక చర్యలు పట్టించుకోకుండా.. విదేశాలు తిరుగుతున్నారనేది ఆయన ఉద్దేశం. అయితే.. ప్రభుత్వ వ్యవస్థలు తమ పని తాము సక్రమంగా చేసేలా స్వేచ్ఛ ఇస్తే గనుక.. ప్రతిరోజూ ప్రతిచోటా ముఖ్యమంత్రి స్వయంగా హాజరు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబుకు అలాంటి అలవాటులేదు. తాను వెంటబడుతుంటే మాత్రమే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, కనుక తానే అతి గొప్ప వాడినని ప్రజలు ప్రతిరోజూ గుర్తించాలని ఆయన కోరుకుంటారు. ఆయన చేసే తరహాలో.. సహాయక చర్యలు చేయాల్సిన అధికారుల్ని వారి పని వారు చేసుకోనివ్వకుండా.. ముప్పొద్దులా సమీక్షల పేరుతో బిల్డప్ లు ఇస్తూ ఉండే సంస్కృతిని జగన్ అనుసరించకపోయేసరికి ఆయన ఉడికిపోయినట్లున్నారు.
అందుకే ఆ ఉక్రోషాన్ని వెళ్లగక్కుతూ సీఎంకు లేఖ రాశారు. కానీ ఆయన రాసిన లేఖ జీవిత కాలం లేటు అని చెప్పాలి. ఆయన మరియు ఆయన అనుచరగణాలు దాన్ని చూసి సంతోషించాల్సిందే తప్ప.. ప్రజలు దానిని పట్టించుకునే పరిస్థితిలేదు. వరద సహాయక చర్యలు ఎప్పటికప్పుడు జరగడం మాత్రమే కాదు.. ఇప్పుడు ముప్పు పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది కూడా. ఇంకా వాటి గురించే మాట్లాడుతూ.. ఉంటే చంద్రబాబు వరదరోజుల్లోంచి ఇంకా నిద్రలేవలేదేమో అని జనం అనుకుంటారు.