ఆయన టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో..అంతే కాదు.. సొంతంగా ఇండస్ట్రీలో మంచి పట్టు కలిగిన వ్యక్తి. నిర్మాణ సంస్థ తో పాటు ఇండస్ట్రీని కొంత వరకూ శాసించే శక్తిని కలిగి ఉన్నాడు. ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా కూడా చెలామణి అవుతున్నాడు. ఈయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగే కాదు.. ఇండస్ట్రీలోని జనాలు కూడా ఆయనను గౌరవిస్తారు. ఆయనకు ఇండస్ట్రీపై ఉన్న పట్టు వల్ల పుడుతున్న గౌరవం అది. ఇలాంటి గౌరవంతో ఆయనను వివిధ సినిమాల ప్రివ్యూ షోలకు ఆహ్వానిస్తారు సినిమా వాళ్లు. డిస్ట్రిబ్యూషన్ కోసం సినిమాలను ప్రదర్శించే సమయంలోనే… ఆయనను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు సినిమాల రూపకర్తలు!
ఇలా ఆయా సినిమాల ప్రివ్యూ షోలకు వచ్చిన ఈ హీరో కమ్ ఇండస్ట్రీ పెద్ద… చాలా సినిమాల పట్ల తీర్పును ఇస్తూ ఉంటాడు. ఈ సినిమా ఆడుతుందా.. పోతుందా.. అనే అంశాలను తేల్చి చెబుతూ ఉంటాడు. తన అభిప్రాయాన్ని ఈ విషయంలో చాలా నిర్మొహమాటంగా చెప్పడం ఈ హీరోగారి ప్రత్యేకత. నిర్మాతలు, అక్కడే ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఏమనుకొంటారో.. అనే మొహమాటాలేమీ పెట్టుకోకుండా.. ప్రివ్యూ షో వేసిన స్క్రీన్ వద్దే.. తన జడ్జిమెంట్ ను చెప్పేస్తుంటాడు ఈ హీరో. మరి ఇలా చెప్పడం కొన్ని సార్లు సదరు సినిమా రూపకర్తలను నిరుత్సాహ పరుస్తుంటుంది కూడా!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ హీరోగారు ఇతరులు తీసిన సినిమాల పై తన జడ్జిమెంటును మాత్రం చాలా ఘాటుగా, సూటిగా చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వరసగా ఇలా జరుగుతుండటంతో ఇండస్ట్రీలో ఈయనపై కొత్త రకం సెటైర్లు పడుతున్నాయి. ఊరందరికీ శకునం చెప్పే ఈయన తన సొంత సినిమాల విషయంలో.. తన వాళ్ల సినిమాల విషయంలో మాత్రం సరైన జడ్సిమెంట్ ను ఇవ్వలేకపోతున్నాడు.
వరసగా ఈయ సినిమాలన్నీ పోతున్నా.. ఏం చేయలేకపోతున్నాడు. తన సినిమాలకు అయినా..తన వాళ్ల సినిమాలకు అయినా.. తనే కథ లను ఎంపిక చేసి, వాటిలో మార్పుచేర్పులు చేయించి… వాటిల్లో తన ముద్ర ఉండేలా చూసుకొంటాడు. తీరా ఆ సినిమాలో ప్లాఫ్ అవుతున్నాయి. వీళ్లవాళ్లంతా ఇప్పడు ప్లాఫుల్లోనే ఉన్నారు. మరి వేరే వాళ్లు తీసిన సినిమాల్లో ఏది తక్కువైందో.. ఏది ఎక్కువైందో తేల్చేసే ఈ హీరోగారు.. సొంత సినిమాల విషయంలో ఎందుకు సరైన ఎంపిక చేసుకోలేకపోతున్నాడో!