ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 16

ఈ పరిస్థితుల్లో ప్రజల్లోంచి పుట్టుకుని వచ్చిన విప్లవవీరుడు విలియం వాలెస్‌! అతను సామంతరాజుల్లో ఒకడు కాడు. సామాన్య రైతుబిడ్డ. సాహసి, గొప్ప వీరుడు. మాతృదేశంపై అపారమైన ప్రేమ, ఇంగ్లండుపై అపరిమిత ద్వేషం. హ్యూ బ్రైడ్‌ఫ్యూట్‌…

ఈ పరిస్థితుల్లో ప్రజల్లోంచి పుట్టుకుని వచ్చిన విప్లవవీరుడు విలియం వాలెస్‌! అతను సామంతరాజుల్లో ఒకడు కాడు. సామాన్య రైతుబిడ్డ. సాహసి, గొప్ప వీరుడు. మాతృదేశంపై అపారమైన ప్రేమ, ఇంగ్లండుపై అపరిమిత ద్వేషం. హ్యూ బ్రైడ్‌ఫ్యూట్‌ అనే పెద్దమనిషి కూతుర్ని పెళ్లాడాడు. ఒక రోజు అతను తనను వెక్కిరించిన ఇంగ్లీషు వ్యక్తితో పేచీ పడి అతన్ని చంపేశాడు. దానికై గవర్నరు శిక్షిస్తాడని తెలిసి, ఇంటికి వెళ్లి భార్యతో చెప్పి, స్నేహితులతో సహా అడవుల్లోకి పారిపోయాడు. గవర్నరు వాలెస్‌ భార్యను రప్పించి, ఆమె వద్ద నుండి సమాచారం రాబట్టలేక కోపంతో కత్తితో ఆమెను నరికివేశాడు. ఆమెనే కాదు, వాలెస్‌ స్నేహితులను, పనివారినీ అందర్నీ చంపేశాడు. ఇంటికి నిప్పు ముట్టించాడు. అతన్ని దేశద్రోహిగా ప్రకటించాడు. అతన్ని సజీవంగా కాని, నిర్జీవంగా కాని పట్టిచ్చినవాడికి బహుమతి ప్రకటించాడు. తన భార్య మృతి తెలిసి వాలెస్‌ ప్రళయరుద్రుడిలా ఆ రాత్రే గవర్నరు పై దాడి చేశాడు. ఆ వార్త వినగానే నగరంలోని ఇంగ్లీషు వారందరూ పగ తీర్చుకోవడానికి వాలెస్‌ మిత్రుల కోసం వేటాడారు. కానీ నగరప్రజలందరూ ఒక్క తాటిపై నిలబడి తెల్లవారేసరికి వందలాది ఇంగ్లీషువారిని మట్టుపెట్టారు. 

ఇది జరిగిన కొన్ని రోజులకే స్కాట్లండ్‌లోని సామాన్యజనులందరూ ఆయుధాలు ధరించి వాలెస్‌ వెంట నడిచారు. జమీందార్లు, సామంతరాజులు వాలెస్‌ వంటి తక్కువ స్థాయి వాడి నాయకత్వాన్ని అంగీకరించలేదు. పైగా వారికి ఇంగ్లండులో భూములున్నాయి, ఇంగ్లండు రాజుతో వైరం తెచ్చుకోలేరు. వాళ్ల సాయం లేకపోయినా వాలెస్‌ దక్షిణ స్కాట్లండ్‌లోని ఇంగ్లీషు వారినందరినీ తరిమివేశాడు. వాలెస్‌కున్న ప్రజాబలం గొప్పదని ఇంగ్లండుకి అర్థమైంది. శాంతిప్రతిపాదనలు చేశారు. ఐర్‌ అనే వూళ్లో ఒక చెక్క గోదాము (బార్న్‌)లో సమావేశమై సంధిషరతులు చర్చిద్దామన్నారు. శాంతి కోసం తపిస్తున్న జమీందారులు, వీరులు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. పెద్దగా ఆయుధాలు ధరించకుండా బయలుదేరారు. ఇద్దరేసి, ముగ్గురేసి వీరులు గుఱ్ఱం దిగి ఆ గోదాములోకి ప్రవేశించగానే లోపల వున్న ఇంగ్లీషు సైనికులు వారిని పట్టుకుని మెడకు ఉరి బిగించి, పై దూలానికి ఉరేసేవారు. బయటివాళ్లకు ఆ సంగతి తెలిసేది కాదు. ఇలా అనేకమంది స్కాట్‌ వీరులను ఇంగ్లీషువారు మట్టుపెట్టారు. కానీ అసలు వీరుడు వాలెస్‌ యింకా రాలేదు. ఆలస్యమైందని కంగారు పడుతూ అతను వస్తున్నాడు. అంతలో దారిలో ఒక మహిళ ఎదురైంది. గోదాములోకి వెళ్లినవారి అలికిడి వినరాకపోవడంతో సందేహించి ఆమె చాటుగా గమనించి, యీ హత్యాకాండను కనుగొంది. పరిగెత్తుకుని వెళ్లి వాలెస్‌ను హెచ్చరించింది. వాలెస్‌ వెంటనే వెనక్కి తిరిగి వెళ్లి మరి కొందర్ని వెంటపెట్టుకుని వచ్చాడు. ఈ లోపుగా చీకటి పడింది. ఊళ్లో ఇంగ్లీషు వారు నివసిస్తున్న యిళ్ల గుమ్మాలపై ఆ మహిళ సుద్దతో గుర్తులు పెట్టింది. వాలెస్‌, అతని మనుషులు ఆ యిళ్ల చుట్టూ కొమ్మలు, ఎండుటాకులు పరిచి సంకేతం అందగానే ఒకేసారి నిప్పు ముట్టించారు. ఇంగ్లీషు వారందరూ కాలి దగ్ధమై పోయారు. చరిత్రలో ఈ సంఘటనను 'బ్లాక్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ ఐర్‌'గా పేర్కొంటారు.

ఎడ్వర్డ్‌ ఏలుబడిలోకి వచ్చిన ఏడాది లోపుగా ఉత్తర స్కాట్లండ్‌లోని డన్‌బార్‌ కోట ఒక్కటి తప్ప తక్కిన వన్నీ చేజారడంతో విదేశీ దండయాత్రల్లో వున్న ఎడ్వర్డు వెంటనే స్కాట్లండ్‌ వెళ్లి వాలెస్‌ను ఓడించమని తన సామంతరాజులను ఆదేశించాడు. అప్పటికే వాలెస్‌ డన్‌బార్‌ కోట పట్టుకున్నాడు. ఇంగ్లీషు సేన వస్తోందని వినగానే వాలెస్‌ డన్‌బార్‌ కోట వదలి స్టిర్లింగ్‌ వద్ద ఇంగ్లీషు సైన్యంతో తలపడడానికి బయలుదేరాడు. నదికి యిరుపక్కలా రెండు సేనలూ మోహరించాయి. ఇంగ్లీషు సైన్యంతో పోలిస్తే తన సైన్యం మూడో వంతే వుందని తెలిసిన వాలెస్‌, తన సైనికుల సంఖ్య తెలియరాకుండా ఎత్తయిన దిబ్బమీద విడిది చేశాడు. అటు ఇంగ్లీషు సైన్యానికి వేగంగా ప్రవహిస్తున్న నదిని గుఱ్ఱాలతో సహా ఎలా దాటాలో అర్థం కావటం లేదు. దానిపై వున్న వంతెన చాలా యిరుగ్గా, యిద్దరు మాత్రమే పట్టేట్లు వుంది. గత్యంతరం లేక ఇంగ్లీషు సైన్యాన్ని కొద్దికొద్దిగా అటు పంపారు. సగం మంది అటు చేరాక, వాలెస్‌ తన సైన్యాన్ని చాటుగా అవతలివైపు పంపి వంతెన కూల్చివేయించాడు. దాంతో ఇంగ్లీషు సైన్యం రెండుగా చీలిపోయింది. వాలెస్‌ నదికి యివతలవైపు వచ్చిన సైన్యంపై విరుచుకుపడ్డాడు. తమ దళాధిపతులు అటు వుండిపోవడంతో, సరైన ఆదేశాలిచ్చేవారు ఎవరూ లేక నది దాటిన తర్వాత చిందరవందరగా నిలబడిన సైన్యం వాలెస్‌ను ఎదిరించలేక పోయింది. వాలెస్‌ నరికి పోగులు పెట్టగా మిగిలిన ముగ్గురు సైనికులు అటు వెళ్లి సామంతరాజులకు విన్నవించబోగా వాళ్లప్పటికే తమ సైన్యంతో సహా పలాయనం చిత్తగించారు. 1297 సెప్టెంబరులో వాలెస్‌ విజయం సాధించిన యీ స్థలాన్ని స్కాట్లెండ్‌లో యాత్రాస్థలంగా గుర్తిస్తారు. వాలెస్‌ స్మారకచిహ్నాన్ని అక్కడ కట్టారు. (సశేషం)

(ఫోటోలు – వాలెస్‌ స్మారకచిహ్నం, స్టిర్లింగ్‌)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives