మనకు అధికారం లేనపుడు వెళ్తే మన వాల్యూ తెలుస్తుంది. అవతలివాడు అధికారంలో వున్నపుడు వెళ్తే వాళ్ల నైజం తెలుస్తుంది. భారీ సినిమాలు తప్ప మరో సినిమాలు తీయను అని చెపుతూ, మెగా, నందమూరి హీరోలతో భారీ సినిమాలు చేసిన నిర్మాత ఒకరువున్నారు. కాస్త నోరు జోరు ఎక్కువ. కిందనుంచి వచ్చాడు కదా, తనకు ఏదితోస్తే అది మాట్లాడేయడం తప్ప లౌక్యం తెలియదు. అలాంటి వాడు ఒక్కసారిగా సినిమాలు మానేసి, తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో పెళ్లి. కాస్త భారీగానే చేస్తున్నాడు. టాప్ రాజకీయ వేత్తల దగ్గర నుంచి సినిమా స్టార్ ల వరకు అందరికీ శుభలేఖలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు.
అందులో భాగంగానే మెగాస్టార్ ను కలిసాడట. పావుగంట మంచిగా మాట్లాడరట. రామ్ చరణ్ ను కలిస్తే గంట వదల్లేదట. ఇక ఇలాగే చాలామంది హీరోలను కలిసి శుభలేఖలు ఇస్తే అంతంటా మంచి స్వాగతం, కుశల ప్రశ్నలు ఎదురయ్యాయట. తను సినిమా తీయని హీరోలు కూడా బాగా పలకరించారట.
కానీ ఓ యంగ్ టాప్ హీరో దగ్గరకు వెళ్తే మాత్రం పొడిపొడిగా రెండుముక్కలు మాట్లాడి, క్షణంలో పంపేసాడట. చిత్రమేమిటంటే, ఆ హీరో డౌన్ ఫాల్ లో వున్నపుడు హిట్ ఇచ్చింది ఇతగాడే. ఇద్దరికీ విబేధాలు వుండే వుండొచ్చు. కానీ పిలవడానికి వచ్చినపుడు మాత్రం కాస్త మొహానికి నవ్వు పులుముకుంటే తప్పేంటీ? పైగా నటులకు అది పెద్దకష్టం కాదు కదా?
ఈ సీన్ జరిగినపుడు అక్కడ షూటింగ్ స్పాట్ లో చాలామందే వున్నారట. శుభలేఖ ఇవ్వడానికి వస్తే మరీ ఇలా చేయడం ఏమిటి? అని గొణుక్కున్నారట.