ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం అనుకూలంగా వుంటుందన్న సంగతి ఇప్పుడు తెలుగు పాఠకుల్లోకి పూర్తిగా వెళ్లిపోయింది. అందులో సందేహంలేదు. అలా అని ఆంధ్రజ్యోతి తన స్టాండ్ మార్చుకోవాలని కూడా అనుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ పత్రిక మీద, ఆ పత్రికకు చెందిన ఛానెల్ మీద కిట్టనివారు ఏదో ఒకటి చేయడం అన్నది కామన్.
సోషల్ మీడియా అంత భయంకరంగా చెదలు పట్టేస్తోంది రాను రాను. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు వాయిస్ ను మిమిక్రీ చేస్తూ, ఏబిఎన్ చానెల్ లోగోను వాడుతూ 'కమ్మ సామాజిక' వర్గానికి బాబు అనుకూలం అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారట. ఈ సమస్య వైకాపాకు కూడా వుంది.
జగన్ పర్సనల్ అసిస్టెంట్ ఫోన్ నెంబర్ వాడుతూ సోషల్ మీడియాలో వాయిస్ రికార్డులు పెడుతున్నారు. అయితే గమ్మత్తు ఏమిటంటే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం. తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేయడం.
పొనీ పార్టీ తరపునో, లేదా చంద్రబాబు నాయుడుకి డ్యామేజ్ జరుగుతోందనో వర్ల ఫిర్యాదు చేసి వుండొచ్చు. మరి ఆంధ్రజ్యోతి సంగతేమిటి? ఇక వర్ల ఫిర్యాదు చేసారు కాబట్టి, అవసరం లేదని వదిలేసినట్లు అనుకోవాలా? ఆ మధ్య ఓ సంఘటనలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం సైబర్ క్రయిమ్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇప్పుడు ఇంత కీలకమైన విషయంపై వర్ల రామయ్య ఫిర్యాదుతో వదిలేసారు. ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేయాలంటే హైదరాబాద్ లో చేయాలి. ఇక్కడ తెరాస ప్రభుత్వం వుంది. అంత సీరియస్ గా తీసుకుంటుందో? తీసుకోదో? అక్కడ వర్ల రామయ్య ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటారు. ఎక్కడ వున్నా తెచ్చి లోపల వేస్తారు.
ఇప్పటికే తెలుగుదేశం నాయకులు ఇలా ఫిర్యాదు చేయడం కేసులు పెట్టడం జరిగింది గతంలో. బహుశా అందుకే ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారాన్ని అలా వదిలేసి వుండొచ్చు. కానీ ఇవన్నీ ఇలావుంటే, రాను రాను ఆంధ్రజ్యోతి ఈజీక్వల్టు తెలుగుదేశం అన్నట్లు మారిపోతోంది.
ఏ విధమైన ప్రచారం అయినా రాను రాను అది ఆ పత్రికను తెలుగుదేశం పార్టీ పెరట్లో కట్టేసేలా జరుగుతోంది. పైగా ఆంధ్రజ్యోతికి బదులు తెలుగుదేశం పార్టీ జనాలు ఫిర్యాదులు చేసి, అరెస్టులు సాగిస్తే, ఇది మరింతగా అటే మొగ్గినట్లు అవుతుందేమో?