బయోపిక్ రూపకర్తలు చాలా తెలివిగా, రెండు భాగాలకు కలిపి ఒకటే ట్రయిలర్ విడుదల చేసారు. దీనివల్ల ఏభాగం ఎంతవరకు వుంటుందన్న క్లారిటీ ఆడియన్స్ కు అంత సులువుగా దొరకదు. ఫస్ట్ పార్ట్ విడుదలయితే తప్ప, తొలిభాగం ముగింపు ఎక్కడ అన్నది అస్సలు తెలియదు. రాజకీయాల్లోకి రావాలనుకునే వరకు తొలిభాగం అని, కాదు.. కాదు అధికారం సాధించడంతో తొలిభాగం ముగుస్తుందని ఇలా భిన్నమైన గ్యాసిప్ లు వున్నాయి.
ట్రయిలర్ లో అయితే అసెంబ్లీ తదితర దృశ్యాలు అనేకం వున్నాయి. కానీ తొలిభాగం టైటిల్ కథానాయకుడు అన్నదాన్ని బట్టి, ఫస్ట్ పార్ట్ పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతుందని, రాజకీయాలు టచ్ చేయరని అనుకోవాల్సి వస్తోంది. తొలిభాగం ముగింపు ఇలా వుంటుందంటూ అనేక వదంతులు వినవస్తున్నాయి. తొలిభాగం ముగింపు బీచ్ ఒడ్డున, ఎన్టీఆర్ సంఘర్షణతో ముగుస్తుందని తెలుస్తోంది.
నిమ్మకూరులో నాటకాలతో మొదలై, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, అవినీతి, సంఘర్షణ, రాజీనామా, సినిమాల్లో ప్రవేశం, షూటింగ్ లు, ఇంట్లో సరదాలు, సందళ్లు, ఆపై అరవైఏళ్లు రావడంతో, ప్రజా జీవితంలోకి వెళ్లాలని అనుకోవడం, అందరూ వద్దని వారించడం, ఈలోగా కేంద్రం వద్ద తెలుగువాడికి అవమానాలు, ఒక తెలుగువాడిగా బీచ్ ఒడ్డున, జనం కోసమే సినిమా అనుకున్నాను, ఆ జనానికి తాను చేరువ కావడానికి అడ్డయితే ఆ సినిమాను కూడా వదులుకుంటాను అనుకుంటూ, ప్రజా జీవితానికి నాంది పలకడంతో ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ముగుస్తుందని తెలుస్తోంది.
మొత్తం మీద ట్రయిలర్ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ మీద ఆసక్తి పెరిగింది. దాంతో సినిమా విషయాలు ఒక్కొక్కటి సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. నిన్నటికి నిన్న ఎవరెవరు? ఏ పాత్రలు వేస్తున్నారు అన్న విషయం చక్కర్లు కొట్టింది. ఇప్పుడు క్లయిమాక్స్ ఏమిటన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇంక ఎన్ని విషయాలు బయటకు వస్తాయో?