అనిల్ సుంకర మళ్లీ అదే తప్పు?

సినిమా మీద ప్రేమ, పిచ్చి వున్న నిర్మాతలు ప్రాజెక్టు స్టార్ట్ చేసాక, ఇక కిందామీదా చూసుకోరు. అంతా అయిపోయి, మార్కెటింగ్ మొదలు పెట్టిన తరువాత బోధపడుతుంది అసలు విషయం. హీరో ఎంత? హీరో రేంజ్…

సినిమా మీద ప్రేమ, పిచ్చి వున్న నిర్మాతలు ప్రాజెక్టు స్టార్ట్ చేసాక, ఇక కిందామీదా చూసుకోరు. అంతా అయిపోయి, మార్కెటింగ్ మొదలు పెట్టిన తరువాత బోధపడుతుంది అసలు విషయం. హీరో ఎంత? హీరో రేంజ్ ఎంత? అమ్మకాలు ఏ మేరకు అన్నది డిస్కషన్ల లోకి వస్తుంది.

నితిన్ సినిమా అ..ఆ హిట్ కాగానే అనిల్ సుంకర – నితిన్ తో లై సినిమా ప్లాన్ చేసారు. ఆ సినిమాకు ఏకంగా ముఫై అయిదుకోట్ల వరకు ఖర్చు చేసేసారు. దాంతో సినిమా విడుదల టైమ్ లో కష్టాలు మొదలయ్యాయి. నేరుగా రిలీజ్ నష్టాలు అవన్నీ వేరే సంగతి.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటి వరకు చేసిన ఏ ఒక్క సినిమాకు కూడా నిర్మాతలు బాగుపడింది లేదు. అతగాడికి నలభై కోట్ల మార్కెట్ వుందని చెప్పుకొవడం తప్ప, నిర్మాతలు మాత్రం కొంప కొల్లేరు అయిపోయిన వారే.

అల్లుడు శ్రీను దగ్గర నుంచి లేటెస్ట్ గా సాక్ష్యం వరకు. అలాంటి హీరోతో సినిమా చేసేటపుడు జాగ్రత్తగా వుండాలి కదా? కానీ అనిల్ సుంకర మళ్లీ నలభై కోట్ల వరకు బెల్లంకొండ-తేజ కాంబినేషన్ సినిమాకు ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది.

తేజ లేటెస్ట్ హిట్ నేనే రాజు నేనే మంత్రి అందులో సగం కూడా వసూలు చేయలేదు. మరి హీరో వ్యవహారం ఇలా వుంటే, డైరక్టర్ వ్యవహారం అలా వుంటే, అనిల్ సుంకర ఏ ధీమాతో ఇంత ఖర్చుకు దిగుతున్నట్లో?