అన్నకూ ఈనాడే.. తమ్ముడికీ ఈనాడే

అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పటి వరకు ఈనాడులో రిపోర్టర్ గా వుండే కురసాల కన్నబాబు (డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు) చిరంజీవికి దగ్గరయ్యారు. మీడియా విభాగం వ్యవహారాలు చూసారు. మెల్లగా ఎమ్మెల్యే…

అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పటి వరకు ఈనాడులో రిపోర్టర్ గా వుండే కురసాల కన్నబాబు (డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు) చిరంజీవికి దగ్గరయ్యారు. మీడియా విభాగం వ్యవహారాలు చూసారు. మెల్లగా ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత ఇప్పుడు వైకాపాలో వున్నారు. అదంతా వేరే సంగతి.

ఇప్పుడు తమ్ముడు చిరంజీవికి కూడా మరో ఈనాడు రిపోర్టర్ నే దగ్గరయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈనాడులో సితార హెడ్ గా చాలాకాలం పనిచేసిన చక్రవర్తికి అప్పట్లో పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు వుండేవి. తరువాత చక్రవర్తి సితార నుంచి జనరల్ రిపోర్టింగ్ కు వెళ్లిపోయారు.

ఇటీవల మళ్లీ పవన్ కు చక్రవర్తికి మధ్య సంబంధాలు పెరిగాయని, జనసేన మీడియా విభాగంలోకి చక్రవర్తిని తీసుకునే సమాలోచనలు సాగుతున్నాయని వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవానికి తెలుగుదేశం మీడియా విభాగం మాదిరిగానే జనసేన మీడియా విభాగాన్ని తయారుచేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అనేకమంది ఈనాడు జర్నలిస్టులు తెలుగుదేశం మీడియా విభాగంలో చేరి పటిష్టం చేసారు. ఇప్పుడు అదే అడుగుజాడల్లో జనసేన మీడియా విభాగం తయారవుతోంది.

అందుకే ఈనాడుకు చెందిన చక్రవర్తికి మీడియా విభాగం బాధ్యతలు అప్పగించి, ఆయన చేతే, అందులోకి నియామకాలు చేపడతారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగనాట మీడియా దాదాపు తొంభైశాతం ఒకే వర్గానికి చెందినది అన్న టాక్ వుంది. అందువల్ల ఎవరికి మీడియా విభాగం కోఆర్డినేటర్ కావాలన్నా ఆ వర్గానికి చెందిన వారినే తీసుకోవడం పరిపాటి. అలా అయితే మీడియా మేనేజ్ మెంట్ సులువు అవుతుందని ఓ ఆలోచన. జనసేన కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా వుంటే చక్రవర్తిని మీడియా విభాగానికి కాకుండా జనసేన పార్టీ ఆఫీసులో కీలకపోస్టుకు తీసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. మొత్తానికి జనసేనలోకి తీసుకోవడం అన్నది పక్కా.