అన్నయ్యకు ధీటుగా తమ్ముడి అభిమానులు

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌.. ఇద్దరూ సినీ రంగంలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నా.. అన్నయ్యను మించిన ఇమేజ్‌ సినిమాల్లో పవన్‌ సాధించుకున్నా.. పవన్‌ని ఇంకా అన్నయ్యచాటు తమ్ముడనే అంటారు చాలామంది. అభిమానులైతే అన్నయ్య చిరంజీవి పేరుతోనే అభిమాన…

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌.. ఇద్దరూ సినీ రంగంలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నా.. అన్నయ్యను మించిన ఇమేజ్‌ సినిమాల్లో పవన్‌ సాధించుకున్నా.. పవన్‌ని ఇంకా అన్నయ్యచాటు తమ్ముడనే అంటారు చాలామంది. అభిమానులైతే అన్నయ్య చిరంజీవి పేరుతోనే అభిమాన సంఘాల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా పవన్‌, చిరంజీవి అభిమానుల మధ్య విభజనే రాలేదు. కానీ ఇప్పుడా విభజన స్పష్టంగా కన్పిస్తోంది. అంతా రాజకీయం.!

అవును రాజకీయమే.. ఎందుకంటే, చిరంజీవి కాంగ్రెస్‌ నేత. పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ అధినేత. అక్కడే వచ్చింది సమస్య అంతా. పవన్‌, కాంగ్రెస్‌ని కడిగేస్తోంటే.. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ భుజానికెత్తుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి అభిమానులు, పవన్‌ అభిమానులతో అన్ని సందర్భాల్లోనూ ఏకీభవించలేకపోతున్నారు. ‘సినీ నటుడిగా అభిమానిస్తాం..’ అనే మాట చెప్పి, పవన్‌ని దూరం పెట్టారు చిరంజీవి అభిమానులు. ఇది పవన్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

పవన్‌కళ్యాణ్‌ యువసేనగా పవన్‌ అభిమానులు వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ విభజన అభిమానుల మనసుల్లో చాన్నాళ్ళ క్రితమే జరిగిపోయింది. అదిప్పుడు అధికారికంగా జరిగేలా కన్పిస్తోంది. అభిమానుల్ని ఒక్కతాటిపై నడిపిస్తోన్న నాగబాబు, అల్లు అరవింద్‌ రంగంలోకి దిగి.. విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయట.

పవన్‌ని అభిమానులు అభిమానించడమే తప్ప.. వారిని చిరంజీవిలా పవన్‌ ఎంకరేజ్‌ చేసింది లేదు. ‘పవనిజం..’ అంటూ పవన్‌ అభిమానులు తమ అభిమాన హీరోని కేవలం నటుడిగానే కాక, ఆయనలోని కొన్ని ‘స్పెషల్‌ క్వాలిటీస్‌’ని ప్రత్యేకంగా అభిమానిస్తారు. ఈ నేపథ్యంలో అసలంటూ పవన్‌, తన అభిమాన సంఘాల్ని ఎంకరేజ్‌ చేస్తారా.? అన్నదిక్కడ అసలు సిసలు ప్రశ్న. పవన్‌ తమను ఎంకరేజ్‌ చేసినా, చెయ్యకపోయినా.. ఆయన కోసం ఏమైనా చేస్తామనీ, ఆయన పేరుతో ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేస్తామని పవన్‌ అభిమానులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ అభిమానులు భవిష్యత్తులో చిరంజీవిపైనా, చిరు అభిమానులు పవన్‌పైనా విమర్శలు చేసుకునే స్థాయికి పరిస్థితి చేజారుతుందా.? అన్నది చర్చనీయాంశమయ్యింది.