హైద్రాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా జరిగే గణేష్ నిమజ్జనం.. ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచే చాలా చోట్ల గణేష్ మండపాల నుంచి నిమజ్జనానికి విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. బాలాపూర్ గణేష్ విగ్రహం తొలుత నిమజ్జనానికి పయనం కాగా.. పలు విగ్రహాలు నిమజ్జనం వైపు అడుగులు వేస్తున్నాయి.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిమజ్జన ఊరేగింపులు మరింత జోరందుకున్నాయి. హైద్రాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్ వద్ద వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తూ ఓ ఆటో బోల్తా పడ్డంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తక్షణం స్పందించిన పోలీసులు, సాధారణ ప్రజానీకం గాయాల పాలైనవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ఒక్క ఘటన మినహా నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది.
మధ్యాహ్నం 1.30 సమయానికి చాలా విగ్రహాలు ఇంకా ఊరేగింపుకి కూడా బయల్దేరకపోయినా, పెద్దయెత్తున హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలైతే జరుగుతుండడం గమనార్హం. సాయంత్రం ఆరు గంటల సమయం విగ్రహాల నిమజ్జనంలో అత్యంత కోలాహలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కాగా, రాత్రి 7 గంటల తర్వాతగానీ, హైద్రాబాద్‌కే ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఊరేగింపుకు వెళ్ళే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ గణేష్‌కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఈ విగ్రహం నిమజ్జనంతో హైద్రాబాద్‌లో నిమజ్జనోత్సవం పూర్తయినట్లు భావిస్తారు. ఊరేగింపు ప్రారంభమైన తర్వాత నిమజ్జనానికి కనీసం 7 గంటల సమయం పడ్తుంది ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి సంబంధించి. కాగా, ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఊరేగింపులో హెలికాప్టర్ ద్వారా పూలు జల్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.