అన్నివేళ్లు విజయ్ వైపే ఎందుకు?

సాధారణంగా సినిమాలు ఫ్లాపు అయినా యావరేజ్ అయినా అయితే ఎక్కువగా డైరక్టర్ నే అందరూ ఎత్తి చూపుతారు. కథ, కథనాలు బాగా లేకున్నా కూడా డైరక్టర్ నే తప్పు పడతారు. ఎప్పుడో కానీ హీరో…

సాధారణంగా సినిమాలు ఫ్లాపు అయినా యావరేజ్ అయినా అయితే ఎక్కువగా డైరక్టర్ నే అందరూ ఎత్తి చూపుతారు. కథ, కథనాలు బాగా లేకున్నా కూడా డైరక్టర్ నే తప్పు పడతారు. ఎప్పుడో కానీ హీరో ఛాయిస్ రాంగ్ అని కానీ, హీరో తప్పు చేసాడని కానీ అనడం అరుదు. మహా అయితే ఈ కథ ఎలా ఓకే చేసాడు హీరో అని మాత్రం అంటారు.

అలాగే సినిమాలు బాగా లేకపోతే హీరోలు కెలికారు అన్న మాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. అయితే అది సాధారణంగా ఎడిటింగ్ టేబుల్ మీద జరుగుతుంటుంది. సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లు జరిగాక, ఓసారి ఫైనల్ అయ్యాక హీరోలు సాధారణంగా టేకింగ్ లో కలుగచేసుకోరు. ఫైనల్ ఎడిటింగ్ అప్పుడు మాత్రం కాస్త చేయి చేసుకునే సందర్భాలు అందరు హీరోలకు వుంటాయి.

కానీ డియర్ కామ్రేడ్ విషయంలో ఇండస్ట్రీలో ఒపీనియన్లు వేరుగా వున్నాయి. పైకి ఎవ్వరూ ఏమీ అనకపోయినా, అందరూ హీరో విజయ్ నే తప్పు పడుతున్నారు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు పెద్దహిట్ కావడంతో అతనే మొత్తం ప్రాజెక్టు చేతిలోకి తీసుకుని, స్క్రిప్ట్ లో మార్పులు, రీషూట్ లే కాదు, డైరక్టర్ ను పక్కన కూర్చోపెట్టి, డైరక్షన్ కూడా చేసేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఓ క్యారెక్టర్ కీలకపాత్ర పోషించిన నటుడు షూటింగ్ జరుగుతున్నపుడే బయట తన మిత్రులతో సినిమాను విజయ్ నే చేసుకుంటున్నాడని చెప్పినట్లు వినిపిస్తోంది. అలాగే సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ పోషించిన నటుడు కూడా సినిమా షూటింగ్ సందర్భంగా విజయ్ నే సీన్ ఎక్స్ ప్లెయిన్ చేసాడని చెప్పడం విశేషం.

విశాఖ ప్రమోషన్ సభలో నటుడు సుహాస్ తదితరులు విజయ్ తమతో క్యారవాన్ లో సీన్ల డిస్కషన్ చేసి, తమను గైడ్ చేసారని, అందుకు థాంక్స్ అని చెప్పారు. మరోపక్క అసలు ఈ సినిమా కథకు టైటిల్ మిస్ లిల్లీ అని, హీరోయిన్ మీదే సాగుతుందని, అయితే మార్చామని డైరక్టర్ భరత్ నే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

పైగా సినిమాలో చాలా సీన్లు అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేయడం వంటివి విజయ్ మనోభిప్రాయానికి దగ్గరగా వున్నాయని గుర్తు చేస్తున్నారు. పైగా సినిమాను నాలుగు భాషల్లో డబ్ చేయడం అన్నది, ప్రమోషన్ మ్యూజిక్ ఫెస్టివల్ చేయడం అన్నది విజయ్ నిర్ణయమే అని బాహాటంగానే వెల్లడయింది.

దీంతో సినిమా ఇలా రావడానికి కారణం విజయ్ నే అంటూ కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పైగా దర్శకుడు భరత్ నెమ్మది, కొత్తవాడు, బ్యానర్ చూస్తే మైత్రీ మూవీమేకర్స్ లాంటి పెద్ద బ్యానర్, హీరో బాగా క్రేజ్ వున్న యంగ్ హీరో. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా పక్కదారి పడుతుంటే దర్శకుడి మీద వదిలేయరు.

అటు ఇటు చేసి, సరి చేసుకుంటారు. పైగా ఈ దర్శకుడు అంత స్పీడ్ గా, మాట చెలామణీ చేయించుకోగల సత్తా వున్నవాడు కాదు. అందువల్ల, అన్ని కారణాల వల్ల ఇండస్ట్రీ జనాల వేళ్లు విజయ్ వైపే చూపిస్తున్నాయి. ఇకనైనా విజయ్ స్క్రిప్ట్ లు ఓకె చేసి, సినిమాను దర్శకులకు వదిలేస్తే, ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు స్ప్రెడ్ కాకుండా వుంటాయి.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు