రాధా కథ వివాదం ముదురుతోంది. ఈ కేసు ఇప్పుడు రచయితల సంఘంలో ఉంది. రాధా భవిష్యత్తు నిర్ణయం అయ్యేది అక్కడే. ఈ టోటల్ ఎపిసోడ్‌లో మారుతిని అందరూ టార్గెట్ చేస్తున్నా – అందులో కీలక భాగం వెంకటేష్‌దేనట. ఏడాది క్రితం వెంకటేష్‌కి ఇద్దరు రచయితలు కలిశారు. ఓ కథ వినిపించారు. అది ఓ ఎమ్మెల్యే లవ్ స్టోరీ. అది వెంకీకి బాగా నచ్చిందట. కానీ.. ఈ కథని వాళ్లు టేకప్ చేయగలరా? లేదా? అనే సందేహంతో… ముందడుగు వేయలేకపోయాడు.
ఈలోగా మారుతితో ఓ సినిమా చేయాల్సివచ్చింది. కానీ మారుతి చెబుతున్న కథలేవీ ఎక్కకపోవడంతో `ఎమ్మెల్యే లవ్ స్టోరీ` అనే లైన్ ఉంది.. దానిమీద ట్రై చేయ్…అని వెంకీ హింట్ ఇచ్చాడట. మారుతి దానిపై స్టోరీ తయారు చేసుకొన్నాడు. ఈ వ్యవహారం వెంకీని కలుసుకొన్న రచయితలిద్దరికీ తెలిసింది. వాళ్లు వెంటనే.. రైటర్స్ అసోషియేషన్‌లో పిర్యాదు చేశారు. ఈతతంగం చాలా రోజుల నుంచీ నడుస్తున్నా – పెద్ద మనుషులతో వ్యవహారం కాబట్టి వాళ్లు సైలెంట్‌గా ఉన్నారట.
ఇప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకొని మారుతికి కబురంపారు. నీ కథ ముందు రిజిస్టర్ చేయించు. లైన్ ఒకేలా ఉంటే… అప్పుడు ఆలోచిస్తాం అన్నార్ట. అందుకే అప్పటికప్పుడు మారుతి 20పేజీల కథ (సింగిల్ లైన్) రాసి రిజిస్టర్ చేయించాడు. ఈ ఎపిసోడ్‌లో అసలు తప్పంతా వెంకీదే అని.. ఆ ఇద్దరు వ్యక్తుల అభియోగం. కథ నచ్చినప్పుడు మరో దర్శకుడికి అప్పగించి… రచయితలుగా గౌరవించాల్సింది. లేదంటే.. ఎంతో కొంత ముట్టజెప్పి సంతృప్తిపెట్టాల్సింది. ఇవి రెండూ జరగలేదు.
అందుకే.. ఇప్పుడు రాధా వ్యవహారం ఇంత దూరం వచ్చింది. బంతి ఇప్పడు రైటర్స్ అసోసియేషన్‌లో ఉంది. వాళ్లెం చెబితే మారుతి అది చేయాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి.