సంక్రాంతికి విడుదలవుతాయని అనుకున్న రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు సమ్మర్‌కి వాయిదా పడడంతో సంక్రాంతి బరిలో రెండే పెద్ద సినిమాలున్నాయి. పవన్, త్రివిక్రమ్ సినిమాతో పాటు బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్‌ల చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. దీంతో సంక్రాంతికే అనుష్క నటిస్తున్న 'భాగమతి' చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి యువి క్రియేషన్స్ సన్నాహాలు చేస్తోందనే వార్తలొచ్చాయి.
పెద్ద సినిమాలకి పోటీగా వెళ్లి ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలతో విజయాన్ని అందుకున్న యువి సంస్థ మరోసారి అదే స్ట్రాటజీకి వెళుతోందని అనుకున్నారు. అయితే తాజా వార్తలని బట్టి భాగమతి ముందుగా అనుకున్నట్టు డిసెంబర్లోనే రిలీజ్ అయ్యేలాగుంది. భాగమతి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
మిగతా భాషల్లోను సంక్రాంతికి రద్దీ ఎక్కువ వుంటుంది కనుక అన్ని భాషల్లోను లాభదాయకమైన డేట్‌కి రిలీజ్ చేయడానికి ఫిక్స్ అవ్వాలని మరోసారి నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. యు.వి. క్రియేషన్స్ పోటీనుంచి తప్పుకున్నట్టయితే సంక్రాంతికి వచ్చే చిత్రాలకి థియేటర్ల కొరత ఏర్పడదు.